Dhanashree Gives Clarity On Divorce Rumours: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని తన పేరు నుంచి చాహల్ పేరుని ధనశ్రీ తొలగించిందో లేదో.. వాళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చాహల్ తోటి స్నేహితుడితోనే ఎఫైర్ నడుపుతోందంటూ పుకార్లు కూడా షికారు చేశాయి. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోవాలని నిర్ణయించుకున్నారని, అందుకే తన పేరులో నుంచి చాహల్ పేరుని తొలగించిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వెంటనే చాహల్ క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ పనికిమాలిన రూమర్స్ అంటూ గట్టిగా బదులిచ్చాడు.
ఇప్పుడు తాజాగా ధనశ్రీ ఆ వార్తలపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ‘‘నేను ఇక్కడ రియల్ లైఫ్ అప్డేట్స్ ఇస్తున్నా. మోకాలు గాయం కారణంగా నేను కొన్ని రోజుల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా. డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలో అడుగు తడబడటంతో లిగ్మెంట్ దెబ్బతింది. ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నా. నా భర్త యుజ్వేంద్ర చాహల్, కుటుంబ సభ్యుల మద్దతుతో కోలుకోగలుగుతున్నా. ఇలాంటి సమయంలో నా కుటుంబ జీవితం గురించి వస్తున్న రూమర్స్ నన్ను తీవ్రంగా కలిచివేశాయి. కానీ, ఇలాంటివన్నీ తట్టుకొని, నేను మరింత శక్తివంతంగా మారుతా. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ధనశ్రీ చెప్పుకొచ్చింది.
కాగా.. 2020లో ధనశ్రీ, చాహల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్లిద్దరూ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెడుతూ.. అభిమానుల్ని అలరిస్తూ ఉంటారు. ధనశ్రీ అయితే, తరచూ రీల్స్ చేస్తూ ఉంటుంది. చాహల్ తోటి ఆటగాళ్లతోనూ కలిసి డ్యాన్స్ చేస్తుంటుంది. ఆ వీడియోలు ఆమెకి మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి.
