Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మతపరమైన అలర్లను ప్రేరేపించే కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్న పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని కోరారు. సున్నీ, సూఫీ, బరుల్వీ ముస్లిందరినీ ఈ సంస్థలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని షహబుద్దీన్ కోరారు. దేశసమైక్యత, సమగ్రత కాపాడేందుకు ఇలాంటి సంస్థలపై తక్షణమే నిషేధం విధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆయన మద్దతు ఇచ్చారు.
Read Also: Anti-Hijab Protests In Iran: అట్టుడుకుతున్న ఇరాన్.. ప్రభుత్వ కాల్పుల్లో 50 మంది మృతి
మరోవైపు ఆలిండియా బార్ అసోసియేషన్( ఏఐబీఏ) ఎలాంటి ఆలస్యం లేకుండా పీఎఫ్ఐని త్వరగా నిషేధించాలని.. పీఎఫ్ఐ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం పీఎఫ్ఐని నిషేధించే ప్రక్రియ ప్రారంభం అయినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే పలు ప్రజా సంఘాల నుంచి కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించాలని కోరుతూ డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి.
ఇటీవల 15 రాష్ట్రాల్లో పీఎఫ్ఐ-ఎస్డీపీఐ నెట్‌వర్క్‌పై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఎన్ఐఏ అనేక మంది పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసింది. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎంఎస్ సలామ్ తో పాటు మొత్తం 106 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ, కేంద్ర బలగాల సహకారంలో వీరందరిని అదుపులోకి తీసుకుంది. కనీసం రాష్ట్రప్రభుత్వాలకు తెలియకుండా ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది ఎన్ఐఏ. ఈ దెబ్బతో పీఎఫ్ఐ వెన్నుముకను విరిచినట్లు అయింది. మరోవైపు ఖతార్, కువైట్, టర్కీ దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు వస్తున్నాయి. కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా పీఎఫ్ఐ వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర హోం శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. గతంలో సిమిని నిషేధించిన తర్వాత అందులోని కొంతమంది పీఎఫ్ఐలో పనిచేస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
