దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. థర్డ్‌వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు వస్తున్న క్రమంలో… డెల్టా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుదలకు డెల్టానే కారణమని WHO పదే పదే చెప్తోంది. ప్రపంచంలో 142 దేశాలు డెల్టా కోరల్లో చిక్కుకున్నాయని ప్రకటించింది. అంతేకాదు భారత్ డేంజర్ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిపింది. గామా, బీటాతో పోలిస్తే డెల్టా వెయ్యి రెట్లు అధిక ప్రభావం చూపిస్తోందని హెచ్చరించింది. వారం రోజుల్లోనే ఏడు కొత్త దేశాల్లో డెల్టా ప్రవేశించందని తెలిపింది.భారత్, ఇండోనేషియా దేశాల్లో ఇన్‌ఫెక్షన్ కాస్త తగ్గినా… డెల్టా వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని అంటోంది WHO.
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లోనూ… డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. గత నెల నుంచి నమోదవుతున్న కరోనా కేసుల్లో… 95 శాతం డెల్టా రకానివే అని వైద్యశాఖ నిర్ధారించింది. హైదరాబాద్‌లోనూ 94శాతం కేసులు డెల్టావే అని అంటున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. మహారాష్ట్రలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.
నిన్న డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఒకరు మరణించగా.. ఇవాళ మరొకరు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే.. వీరిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్‌తో మూడు మరణాలు సంభవించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వేరియంట్ల కంటే… వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి డెల్టా వేరియంటే… ఎక్కువగా వ్యాప్తిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా… ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. డెల్టా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
