దీపావళి వచ్చిందంటే చాలు.. బాణాసంచా విషయం వెంటనే తెరపైకి వస్తుంది.. బాణాసంచాతో వాయు కాలుష్యం ఏర్పడుతుందంటూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించడం.. అది ఓ మతంపై జరుగుతోన్న దాడిగా తప్పుబట్టడం జరుగుతూనే ఉంది.. వివిధ సందర్భాల్లో కాల్చే బాణాసంచాపై లేని నిషేధం.. కేవలం హిందువుల పండుగల సమయంలోనే ఎందుకు అంటూ ప్రశ్నించేవారు లేకపోలేదు. దీంతో.. నిషేధం విధించినా.. అవి ఏ మాత్రం పట్టించుకోకుండా టపాసులు కాల్చేస్తున్నారు.. దీంతో.. వాయు కాలుష్యం ఏర్పడుతోంది.. ఇక, దేశరాజధానిలో పరిస్థితి మరీ ఘోరంగా.. టపాసులు కాల్చడంపై నిషేధం విధించినా.. గురువారం రాత్రి భారీ ఎత్తున పటాకులు కాల్చడంతో ఢిల్లీని వాయు కాలుష్యం అలముకుంది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుని ఆందోళనకు గురిచేస్తోంది..
కొన్ని ప్రాంతాల్లో టపాసులు కాల్చడానికి ముందు.. కాల్చిన తర్వాత పరిస్థితిని గమనిస్తే.. ఇది స్పష్టంగా తేలిపోతోంది.. నోయిడాలో అత్యధికంగా కాలుష్యం కమ్ముకుంది. ఢిల్లీలోని పూసా రోడ్డులోనూ గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341గా ఉండగా.. బాణాసంచా కాల్చిన తర్వాత నోయిడాలో ఏక్యూఐ526కు చేరుకుంది.. ఢిల్లీలోని పూసారోడ్డు వద్ద 505కు పెరిగి ఆందోళన కలిగిస్తోంది.. అయితే ఏక్యూఐ 500 దాటిందంటే అది తీవ్రమైన కాలుష్యం కింద లెక్క.. దీంతో.. ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కానీ, ఢిల్లీ సర్కార్ బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చుతూ కనిపించారు. దీంతో.. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగింది.. దీని ప్రభావం చాలా మంది ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
