NTV Telugu Site icon

Delhi school blast: ఢిల్లీ పేలుడులో కీలక విషయాలు.. 2 కి.మీ వరకు శబ్ధం, షాక్ వేవ్స్..

Delhi School Blast

Delhi School Blast

Delhi school blast: ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ఏరియాలోని సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు శబ్ధం 2 కి.మీ వరకు వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల పక్కనే ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. షాక్ వేవ్ ప్రభావాన్ని సృష్టించే విధంగా పేలుడు పదార్థాలను ఉంచినట్లు తెలుస్తోంది.

Read Also: US Intelligence Leaked: ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న ఇజ్రాయిల్.. యూఎస్ రహస్య పత్రాలు లీక్..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. పేలుడులో ఘన లేదా ద్రవ పదర్థాలను వాడినట్లు తెలుస్తోంది. ఇలాంటి కొన్ని సందర్భాల్లో చాలా వేడిని, దట్టమైన, అధిక పీడనం కలిగిన వాయువుగా మార్చబడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పేలుడు నుంచి వచ్చిన పదార్థాలు మొదట్లో చుట్టుపక్కల గాలిలోకి చాలా వేగంగా విస్తరించాయి. రిఫ్లెక్టివ్ ప్రెజర్ వల్ల షాక్ వేవ్స్ ఏర్పడుతాయని చెబుతున్నారు. ఈ షాక్ వేవ్స్ వల్ల హై ప్రెజర్ ఎయిర్ బయటకు వెలువడుతుంది. దీంతో సూపర్ సోనిక్ వేగంతో బయటకు వచ్చే ఈ ఎయిర్ భవనాలు, వాహనాల కిటికీలను దెబ్బతీస్తుంది.

సోర్సెస్ ప్రకారం.. సైట్ వద్ద ఎలాంటి మెటల్ లాంటి వస్తువులు, బాల్ బేరింగ్స్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కనుగొనబడలేదు. ఈ ప్రాంతంలోని షాపులకు ఓ సందేశం ఇచ్చేలా పేలుడు జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడులో పలు దుకాణాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి, అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదు. ఎన్‌ఐఏ అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని, పేలుడు వెనుక ఏమైనా ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకి గల కారణాలు తెలుసుకునేందుకు ఆ ఏరియాల్లోని సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నారు. పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది.

Show comments