Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్‌ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్

Delhi Puc Rules

Delhi Puc Rules

Delhi PUC Rules: దేశ రాజధానిలో ఢిల్లీలో కాలుష్య పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దీంతో, వాహనాల కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం కొత్త అమలు చర్యలను చేపట్టనుంది. అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు అయ్యే Pollution Under Control (PUC) సర్టిఫికెట్ ఉన్నదీ లేనిదీ తనిఖీ చేసే వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గడువు ముగిసిన లేదా చెల్లని PUCతో వాహనాలు నడిపితే చర్యలు తీసుకోనున్నారు.

శీతాకాలం ప్రారంభంతో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బురారీలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ను ఏర్పాటు చేసింది. వాహనాల ఫిట్‌నెస్, కాలుష్య ఉద్గారాలను సాంకేతికత ఆధారంగా పరీక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఉపయోగించనున్నారు. వ్యాలిడిటీ అయ్యే PUC లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అందువల్ల వాహనదారులు తమ PUC సర్టిఫికెట్ గడువు తేదీని ముందుగానే తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

PUC కేంద్రాల్లో కెమెరాలతో నిఘా
ఢిల్లీలోని PUC కేంద్రాల పనితీరును మరింత పారదర్శకంగా మార్చేందుకు అక్కడ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్టిఫికెట్ జారీ ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు, నిబంధనలకు అనుగుణంగా కాలుష్య పరీక్షలు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా పరిశీలించనున్నారు. ఢిల్లీ రవాణా వ్యవస్థలో PUC అనుసరణను పర్యవేక్షించేందుకు ANPR కెమెరాల వంటి ఆటోమేటెడ్ వ్యవస్థలు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ పత్రాల్లో పేర్కొన్నారు.

బురారీలో భారీ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్
బురారీలోని ATS ద్వారా వాహనాల బ్రేకింగ్ సామర్థ్యం, సస్పెన్షన్, హెడ్‌లైట్లు, సైడ్-స్లిప్ తదితర అంశాలను ఆటోమేటెడ్ విధానంలో పరీక్షించనున్నారు. వాహనం రోడ్డుపై నడపడానికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని సాంకేతిక పరీక్షల ద్వారా నిర్ధారించనున్నారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, బురారీ ATSలో ఏడాదికి 40,000 భారీ మోటారు వాహనాలు, 60,000 తేలికపాటి మోటారు వాహనాలు, మొత్తంగా లక్ష వాహనాలను పరీక్షించే సామర్థ్యం ఉంది. ఢిల్లీలో ATS, PUC కేంద్రాల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని PUC కేంద్రాలపై తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు కొనసాగుతున్నాయి. 2025లో PUC కేంద్రాలపై 1,288 తనిఖీలు నిర్వహించగా, ఉల్లంఘనలకు సంబంధించి హెచ్చరికలు, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, రద్దులు వంటి చర్యలు తీసుకున్నట్లు ఢిల్లీ అసెంబ్లీకి సమర్పించిన పత్రంలో పేర్కొన్నారు.