Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్‌లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..

  • హింసకు పాల్పడిన సీజేపీ మద్దతుదారులపై చర్యలకు పోలీసులు సిద్ధం..
  • 5 పోలీస్ స్టేషన్లలో 10 ఎఫ్ఐఆర్‌లు నమోదు..
  • నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన..
Cjp Protest

Cjp Protest

Delhi Police: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన 20వ తేదీ సోమవారం రోజున, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఈ నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసనకారులు పోలీసులపై దాడులు చేయడంతో పాటు ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అయితే, ఇలా హింసకు పాల్పడిన వారికి షాక్ ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు.

5 పోలీస్ స్టేషన్లలో సీజేపీ నిరసనకారులపై 10 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. హింసలో పాలుపంచుకున్న వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు అధునానత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ (FRS) మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ – 4 FIRలు, CP పోలీస్ స్టేషన్ – 3 FIRలు, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ – 1 FIR, బరాఖంబ రోడ్ పోలీస్ స్టేషన్ – 1 FIR, కర్తవ్య పాత్ పోలీస్ స్టేషన్ – 1 FIR నమోదైంది.

హింసాకాండ జరిగిన జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, ఔటర్ సర్కిర్ వద్ద అమర్చిన వందలాది సీసీటీవీ కెమెరాలు, పోలీస్ బాడీ కామ్స్‌, డ్రోన్ ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన డజన్ల కొద్దీ వీడియోలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి పోలీసులు అనుమానితుల ముఖాలను గుర్తించేందుకు తమ వద్ద ఉన్న డేటా బేస్‌తో పోల్చిచూస్తున్నారు. ఈ హింస ముందుగా ప్లాన్ చేసి చేశారా? దీనికి ఏదైనా సంస్థతోగానీ రాజకీయ కుట్రతో కానీ సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. హింసకు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.