Delhi High Court: ఇటీవల విడాకులు, ‘‘భరణాల’’కు సంబంధించిన కేసులు ఎక్కువ అవుతున్నాయి. విడాకుల తర్వాత మహిళలు పెద్ద మొత్తంలో భరణాన్ని కోరుతున్న కేసులపై పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా, ఢిల్లీ హైకోర్టు కూడా కీలక ఒక భరణం కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భరణం అనేది ఒక సామాజిక న్యాయం మాత్రమే అని, ఇది భాగస్వామి ఆర్థికంగా బలపడేందుకు , ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించే సాధనం కాదు’’ అని జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.
‘‘పిటిషనర్ ఆర్థికంగా, స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా సంపాదించుకునే సత్తా ఉన్న చోట భరణం ఇవ్వడానికి సెక్షన్ 25(హిందూ వివాహ చట్టం) కింద న్యాయపరమైన విచక్షణను ఉపయోగించలేము. ఆర్థికంగా స్వయం సమృద్ధి గల వ్యక్తి భరణం కోరడం సమంజసం కాదు. భరణం అనేది బాధితుడికి అవసరం ఉన్నపుడే ఇవ్వాలి.’’ అని చెప్పింది. ఉద్యోగం, జీతం, ఆర్థిక స్థితి బాగున్నవారు భరణం కోరడానికి అర్హులు కాదని కోర్టు తన తీర్పు ద్వారా చెప్పింది.
క్రూరత్వం కారణంగా ఒక మహిళకు శాశ్వత భరణం నిరాకరించి, ఆమె భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. న్యాయవాదిగా పనిచేస్తున్న భర్త, గ్రూప్-ఏ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్(IRTS) అధికారి అయిన భార్య 2010 జనవరిలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన 14 నెలల్లోపే వారు విడిపోయారు.
Read Also: Deputy CM Pawan: ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు.. పవన్ చొరవతోనే గడువు పొడిగించిన కేంద్రం
భార్య తనపై మానసిక, శారీరకంగా క్రూరంగా ప్రవర్తించిందని, తిడుతూ, అవమానకరమైన మెసేజులు పంపిందని, వృత్తిపరమైన, సామాజిక వర్గాల్లో అవమానించిందని భర్త ఆరోపించాడు. అయితే, భార్య వీటన్నింటిని తిరస్కరిస్తూ, భర్తే తనపై క్రూరంగా ప్రవర్తించాడని అభియోగాలు మోపింది. విడాకులకు అంగీకరించడానికి భార్య ఆర్థిక పరిష్కారంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని భార్యనే స్వయంగా అంగీకరించింది.
ఆర్థికంగా లాభపడాలనే కోణం ఈ కేసులో స్పష్టంగా కనపిస్తోందని, ఆమె భరణం వెనక ఆర్థిక ఉద్దేశం ఉందని కోర్టు భావించింది. హైకోర్టు మహిళకు మంచి ఉద్యోగం ఉందని, పిల్లలు లేరని, ఆమె ఆర్థికంగా స్వతంత్రంగా ఉందని గుర్తించింది. దీనికి తోడు భార్య భర్త తల్లిని, భర్తను అవమానించిట్లు తేలింది. దీంతో సదరు మహిళకు భరణం అవసరం లేదని, ఆమె ఆర్థిక అవసరాలే లేవని ఆధారాలతో రుజువైందని, అందుకే భరణాన్ని మంజూరు చేయలేమని హైకోర్టు తీర్పు చెప్పింది.
గతంలో 2024లో ఒక మహిళ రూ. 12 కోట్లు, ముంబయిలో ఇళ్లు, బీఎండబ్ల్యూ కారు కావాలని కోరినప్పుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమె చదువుకుంది, సంపాదించుకుంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెరుగుతున్న భరణాల కేసులకు సంబంధించి కీలకంగా నిలిచింది.
