E-Rickshaw New Rules: ఈ-రిక్షాలు అనగానే ఇష్టం వచ్చినట్టు ప్రయాణికులకు కుక్కడం.. చివరకు డ్రైవర్ సీట్పైనా ప్రయాణికులను కూర్చోబెట్టుకోవడం.. నిషేధిత వస్తువులను కూడా తీసుకెళ్లడం చేస్తుంటాం.. ఇకపై అది కుదరదు.. ఈ-రిక్షాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలతో కూడిన ముసాయిదా పథకాన్ని ప్రతిపాదించింది సర్కార్.. అంటే, ఈ-రిక్షాల్లో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉండనుంది. డ్రైవర్ సీటులో ప్రయాణికులను కూర్చోబెట్టడం, నిలబడి ప్రయాణించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా సంగీతం లేదా ఆడియో ప్లే చేయడంపై ఆంక్షలు విధించనున్నారు. అంతేకాకుండా, ప్రమాదకరమైన బ్యాటరీలు, బుల్ల్బార్లు అమర్చిన వాహనాలను స్వాధీనం చేసుకునేలా ప్రతిపాదనలు చేశారు. అయితే ఇవి ప్రస్తుతం ముసాయిదాలోని నిబంధనలే. అధికారిక గెజిట్‌లో పథకాన్ని ప్రకటించిన తర్వాతే తుది నిబంధనలు అమల్లోకి వస్తాయి.
ప్రయాణికుల భద్రతపై మళ్లీ చర్చ
ఢిల్లీలో మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, నివాస ప్రాంతాల మధ్య ప్రయాణించేందుకు ఈ-రిక్షాలు చౌకైన రవాణా సౌకర్యంగా ఉపయోగపడుతున్నాయి. అయితే, తక్కువ దూరాల్లో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టడం వంటి ఉల్లంఘనలు భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతున్నాయి. గత ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు డ్రైవర్ సీటులో అదనపు ప్రయాణికులను కూర్చోబెట్టిన ఘటనలకు సంబంధించి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 10,499 కేసులు నమోదు చేశారు. 2024 ఏడాది మొత్తంలో నమోదైన 4,503 కేసులతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో, 2025 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఢిల్లీలో ఈ-రిక్షాలు 108 రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మంది గాయపడినట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ-రిక్షాల నిర్వహణను మరింత క్రమబద్ధీకరించడంతో పాటు ప్రయాణికుల భద్రతను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
నలుగురు ప్రయాణికులకే అనుమతి
కొత్త ముసాయిదా ప్రకారం, ఈ-రిక్షాలో డ్రైవర్‌ను మినహాయించి గరిష్ఠంగా నలుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాలి. ప్రయాణికులతో పాటు తీసుకెళ్లే సామాను బరువు 40 కిలోలకు మించకూడదు. వాహనం గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లకు పరిమితం కావాలి. మోటారు సామర్థ్యం 2,000 వాట్లకు మించకూడదు. ప్రయాణికులను డ్రైవర్ సీటులో కూర్చోబెట్టడం, వాహనంలో నిలబడి ప్రయాణించేందుకు అనుమతించడం నిషేధం. డ్రైవర్లు మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో వాహనాలు నడపకూడదు. పేలుడు పదార్థాలు, మండే స్వభావం కలిగిన పదార్థాలు, ప్రమాదకర రసాయనాలను కూడా ఈ-రిక్షాల్లో తరలించరాదు. వాస్తవానికి, 2014లో అమల్లోకి వచ్చిన ఢిల్లీ ఈ-రిక్షా పథకంలోనే అధిక ప్రయాణికులను ఎక్కించడం, డ్రైవర్ సీటులో ప్రయాణికులను కూర్చోబెట్టడంపై నిషేధం ఉంది. ఇప్పుడు ప్రతిపాదించిన ముసాయిదా ఈ నిబంధనల అమలును మరింత కఠినతరం చేయడంతో పాటు తనిఖీలు, ధ్రువీకరణ ప్రక్రియలకు ప్రాధాన్యం ఇస్తోంది.
మ్యూజిక్‌పైనా ఆంక్షలు
ఈ-రిక్షా డ్రైవర్లు విధుల్లో ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా లేదా తమ డ్రైవింగ్‌కు ఆటంకం కలిగించేలా సంగీతం, ఇతర ఆడియోలను ప్లే చేయకూడదు. అయితే, ప్రతిపాదిత నిబంధనల్లో సంగీతంపై పూర్తిస్థాయి నిషేధం లేదు. ఇతరులకు అసౌకర్యం లేదా డ్రైవర్‌కు పరధ్యానం కలిగించే ఆడియోపై మాత్రమే ఆంక్షలు విధించాలని పేర్కొన్నారు. 2014 నాటి పథకంలో విధుల్లో ఉన్నప్పుడు డ్రైవర్లు ఎలాంటి ఆడియో పరికరాలనూ ప్లే చేయకూడదనే నిబంధన ఉండేది. తాజా ముసాయిదాలో ఈ అంశానికి సంబంధించి నిబంధనల స్వరూపంలో మార్పు కనిపిస్తోంది.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
ప్రయాణికులతో లేదా ఈ-రిక్షా ఎక్కేందుకు వేచి ఉన్నవారితో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించకూడదు. వృద్ధులు, దివ్యాంగులు వాహనంలోకి ఎక్కేందుకు, దిగేందుకు అవసరమైన సహాయం అందించాలి. మహిళా ప్రయాణికురాలిపై అసభ్య ప్రవర్తన, వేధింపులు లేదా ఈవ్‌టీజింగ్ వంటి ఘటనలు చోటుచేసుకుంటే డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. బాధితురాలిని సమీప పోలీస్ స్టేషన్, పోలీస్ పోస్టు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) వాహనం వద్దకు తీసుకెళ్లాలని ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగే, ఈ-రిక్షాలను శుభ్రంగా ఉంచాలి. రవాణా శాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రథమ చికిత్స పెట్టె, అగ్నిమాపక పరికరం వంటి భద్రతా సామగ్రిని వాహనంలో అందుబాటులో ఉంచాలి.
బుల్ల్బార్లు, ప్రమాదకర బ్యాటరీలు ఉంటే సీజ్
వాహనాల భద్రతకు సంబంధించి కూడా ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. ఈ-రిక్షాలకు బుల్ల్బార్లు లేదా ముందు భాగంలో క్రాష్ గార్డులు అమర్చినా, ప్రమాణాలకు అనుగుణంగా లేని లేదా ప్రమాదకరమైన బ్యాటరీలను ఉపయోగించినా సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. లోపాలను సరిచేసే వరకు వాహనం విడుదల చేయరు. అన్ని రిజిస్టర్ అయిన ఈ-రిక్షాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి. వాహనం వెనుక భాగంలో పసుపు రంగు రిఫ్లెక్టివ్ స్ట్రిప్ ఉండాలి. యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌ను వాహనం ఎడమ వైపున స్పష్టంగా పెయింట్ చేయాలి. వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో పాదచారులకు లేదా ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదు. ప్రభుత్వం నోటిఫై చేసిన నిషేధిత రహదారులపై ఈ-రిక్షాలు నడపరాదు. ఉపయోగించిన బ్యాటరీలను అధీకృత రీసైక్లర్లకు అప్పగించాలి. బ్యాటరీ సాంకేతికత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
ప్రతి వాహనానికీ డిజిటల్ సర్టిఫికెట్
ఈ-రిక్షాల నిర్వహణను పర్యవేక్షించేందుకు డిజిటల్ విధానంలో ఈ-రిక్షా కంప్లయన్స్ సర్టిఫికెట్ (ఈసీసీ) జారీ చేయాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ఈ సర్టిఫికెట్ రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇది ఒక నిర్దిష్ట వాహనం, లైసెన్స్‌తో పాటు పీఎస్వీ బ్యాడ్జ్ కలిగిన ఒక నిర్దిష్ట డ్రైవర్‌కు అనుసంధానమై ఉంటుంది. వాహనానికి ఫిట్నెస్ ధ్రువీకరణ, బీమా, బ్యాటరీ ప్రమాణాల అనుసరణ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేసే విధానం ప్రతిపాదించారు. ఇప్పటికే రిజిస్టర్ అయిన ఈ-రిక్షాల యజమానులు పథకం అధికారికంగా నోటిఫై అయిన తర్వాత 90 రోజుల్లోగా ఈసీసీ పొందాలి. అవసరాన్ని బట్టి ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ లేకుండా నడిచే వాహనాలను స్వాధీనం చేసుకోవచ్చు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా యజమాని అవసరమైన సర్టిఫికెట్ పొందకపోతే, వాహనాన్ని పారవేయడానికి సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ లేని వాహనాలపై మరింత కఠిన చర్యలు
రిజిస్ట్రేషన్ లేని ఈ-రిక్షాల విషయంలో ముసాయిదా మరింత కఠినంగా ఉంది. అలాంటి వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకోవడంతో పాటు తిరిగి విడుదల చేయకుండా, వాటిని తుక్కుగా మార్చడం లేదా వేలం వేయడం వంటి చర్యలను ప్రతిపాదించారు. వాహనంలో లీజు ప్రాతిపదికన అమర్చిన బ్యాటరీలు ఉన్నా వాటిని తిరిగి ఇవ్వబోమని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదనలు ముసాయిదా పథకంలో భాగం మాత్రమే. తుది నిబంధనలు అధికారికంగా నోటిఫై అయిన తర్వాతే వాటి అమలు స్వరూపం స్పష్టమవుతుంది.
ఈ-రిక్షాల సంఖ్యపై పరిమితి
ఢిల్లీలో ఈ-రిక్షాల సంఖ్యను కూడా నియంత్రించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న వాహనాలకు అనుగుణత సర్టిఫికెట్ పొందేందుకు ఇచ్చే గడువు ముగిసిన తర్వాత మొత్తం ఈ-రిక్షాల సంఖ్యను 2.5 లక్షలకు పరిమితం చేయాలనేది ప్రతిపాదన. వ్యక్తిగత యజమానులు గరిష్ఠంగా ఐదు ఈ-రిక్షాలను మాత్రమే కలిగి ఉండవచ్చు. అర్హత కలిగిన సంస్థలకు గరిష్ఠంగా 100 వాహనాల వరకు యాజమాన్య పరిమితి ప్రతిపాదించారు. ఒక సంస్థ వద్ద 25 లేదా అంతకంటే ఎక్కువ ఈ-రిక్షాలు ఉంటే అగ్రిగేటర్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రజల అభిప్రాయాల స్వీకరణకు 30 రోజుల గడువు
ఈ ముసాయిదాపై ప్రజలు, ఇతర సంబంధిత వర్గాలు తమ అభ్యంతరాలు, సూచనలు సమర్పించేందుకు ఢిల్లీ రవాణా శాఖ 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు ముసాయిదా ప్రచురితమైన తేదీ నుంచి లెక్కిస్తారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని పథకాన్ని అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నిబంధనలు అమల్లోకి వస్తాయి. మొత్తంగా, ఢిల్లీలో ఈ-రిక్షాల నిర్వహణను క్రమబద్ధీకరించడం, ప్రయాణికుల భద్రతను పెంచడం, ప్రమాదకర వాహనాలను రోడ్లపైకి రాకుండా అడ్డుకోవడం ఈ ముసాయిదా ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

