Delhi Court Issues Notice To Adipurush Team And Prabhas: ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ.. ఢిల్లీ కోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే! ఇందులో రాముడు, హనుమంతుడు, రావణుడు పాత్రలను తప్పుగా చూపించారని.. అవి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయంటూ న్యాయవాది రాజ్ గౌరవ్ ఆ పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. వాక్ స్వాతంత్రం ముసుగులో రామాయణాన్ని మార్చలేరంటూ, ఆయన ఆ పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ఢిల్లీ కోర్టు.. తాజాగా ఆదిపురుష్ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. హీరో ప్రభాస్‌కి కూడా నోటీసులు పంపింది. మరి, దీనిపై యూనిట్ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
కాగా.. ‘‘ఈ టీజర్‌లో రాముడు, హనుమంతుడ్ని అసమంజసంగా చూపించారు. ఆ రెండు పాత్రలకు రబ్బర్ దుస్తులు ధరించారు. ఆ ఇద్దరితో పాటు రావణుడ్ని కూడా తప్పుగా చూపించారు. హిందువుల మత, సాంస్కృతిక, చారిత్రక, నాగరికత మనోభావాలను దెబ్బతీసే.. టీజర్‌లో ఆ ముగ్గురి పాత్రల్ని చూపించారు. హిందూ విశ్వాసం ప్రకారం.. రాముడు ప్రశాంతంగా, ఉదారంగా ఉండే వ్యక్తి. కానీ.. ఈ టీజర్‌లో మాత్రం రాముడ్ని కోపంగా, ఇతరుల్ని చంపే భావనల్ని కలిగి ఉన్న వ్యక్తిగా ప్రెజెంట్ చేశారు. రావణుడి పాత్రనైతే మరీ చౌకగా చూపించారు. బాయ్-కట్, క్రూకట్ హెయిర్‌స్టైల్‌తో చెవులపై బ్లేడ్ గుర్తులు ఉన్నాయి. శివుడి పరమభక్తుడైన రావణుడు.. మనోహరమైన దుస్తులు ధరించడంతో పాటు మీసాలు కూడా కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ బంగారు కిరీటం ధరిస్తాడు’’ రాజ్ గౌరవ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు.. రావణుడు తన పుష్పక్ యాన్‌లో సవారీ చేస్తాడని, చాలా దేశాల్లో పూజింపబడే రావణుడ్ని భారతదేశంపై దండెత్తిన మొఘల్ పూర్వీకుడిగా చూపించారని రాజ్ గౌరవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలని ఆపేయాల్సిందేనని ఆయన కోరారు. మరోవైపు.. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కూడా ఈ సినిమాపై మండిపడుతున్నాయి. పాత్రల వేషధారణలు సరిగ్గా లేవని, ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరి, ఈ సవాళ్లను చిత్రబృందం ఎలా ఎదుర్కొంటుందో, సినిమా విడుదలకు మార్గం ఎలా సుగుమం చేస్తుందో చూడాలి.
