Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్‌జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

  • ఢిల్లీలో ఘోర ప్రమాదం
  • సీఎన్‌జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
  • పలువురికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
Delhiblast

Delhiblast

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిక్రీ కలాన్ ప్రాంతంలోని ఓ ఫ్యూయల్‌ పంప్‌లో ట్రక్కు సీఎన్‌జీ సిలిండర్‌ పేలిపోయింది. వాహనంలో సీఎన్‌జీ నింపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.

సీఎన్‌జీ నింపుతుండగా పేలుడు

బుధవారం ఢిల్లీలోని టిక్రీ కలాన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3:37 గంటలకు పేలుడు ఘటనపై తమకు సమాచారం అందినట్లు ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ట్రక్కు సీఎన్‌జీ సిలిండర్‌లో గ్యాస్‌ నింపుతున్న వ్యక్తి పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఫ్యూయల్‌ పంప్‌ దగ్గర భద్రతా చర్యలను చేపట్టారు.