Delhi CM Kejriwal Responds On Gujarat And Himachal Pradesh Exit Polls: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. ఆ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో.. విస్తృతంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంది. కేజ్రీవాల్ అయితే ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగ సమస్యని తీర్చడంతో, మరెన్నో సమస్యలకు పరిష్కారం తీసుకొస్తామని మాటిచ్చారు. ఆప్ నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి విస్తృతమైన ఆదరణ రావడం చూసి.. బహుశా ఆ పార్టీ ఈసారి బీజేపీకి గట్టి పోటీనే ఇవ్వొచ్చని అంతా అనుకున్నారు.
తీరా చూస్తే.. ఆ అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. ఆ పార్టీని గుజరాత్‌లో గానీ, హిమాచల్ ప్రదేశ్‌లో గానీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. కేవలం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ జరిగిందని తేలింది. 182 సీట్లు ఉన్న గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఎన్నికల ఫలితాల్లో ఆ సంఖ్య కాస్త అటు, ఇటు అయినా కావొచ్చని అంటున్నాయి. గుజరాత్‌లో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో అయితే కనీసం ఖాతా తెరవడం కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. గుజరాత్ ఎన్నికల రిజల్ట్స్ తమకు సానుకూలంగా వస్తాయని అన్నారు. బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో ఓ కొత్త పార్టీ 15 నుంచి 20 శాతం ఓట్లు సాధించడం పెద్ద విషయమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు తాము వేచి ఉంటామన్నారు. మరోవైపు.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయ కేతనం ఎగురవేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. 250 సీట్లున్న ఢిల్లీ కార్పొరేషన్‌లో ఆప్ 150 సీట్లకు పైగానే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.