Site icon NTV Telugu

Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉమర్‌కు సహకరించిన కీలక వ్యక్తి ఇతడే.. వెలుగులోకి ఫొటో

Delhi Car Blast6

Delhi Car Blast6

ఢిల్లీ కారు బ్లాస్ట్‌లో ఉగ్రవాది ఉమర్‌కు సహకరించిన.. క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఇతడే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేశాడు. ఉగ్రవాదం వైపునకు మళ్లించాడు. ప్రస్తతం డానిష్‌కు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన

డానిష్.. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాజిగుండ్ నివాసి. పొలిటికల్ సైన్స్ చదివాడు. శ్రీనగర్‌లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతడు డ్రోన్ నిపుణుడిగా గుర్తించారు. డ్రోన్ల ద్వారా అత్యంత శక్తివంతమైన బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడు. డాక్టర్‌ ఉమర్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించాడు. టెర్రర్ మాడ్యూల్‌లో డానిష్ కూడా ఒక కుట్రదారుడు. ఇతడు డ్రోన్లు, రాకెట్ల ద్వారా ఎలా శక్తివంతమైన బాంబులు పేల్చవచ్చో.. అందుకు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని డానిష్ అందించాడు. ఆల్రెడీ బరువైన బాంబులను మోయగలిగే పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన డ్రోన్లు తయారు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. గతంలో చిన్న ఆయుధాలను తీసుకెళ్లే డ్రోన్లను డానిష్ తయారు చేశాడు. తాజాగా పెద్ద ఎత్తున బాంబులు తీసుకెళ్లే డ్రోన్లను తయారు చేస్తు్న్నాడు. ఈ డ్రోన్ టార్గెట్ రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రయోగించడమే. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్‌పై ఇదే తరహాలో ప్రయోగించారు. అలాగే సిరియాలో కూడా ఇతర సంస్థలు కూడా ఇలానే ప్రయోగించాయి. సేమ్.. అదే తరహాలో డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా దాడులు చేయాలని డానిష్, ఉమర్ కుట్ర పన్నినట్లుగా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి.

ఇది కూడా చదవండి: Nitish Kumar: 20నే సీఎంగా నితీష్ ప్రమాణం.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు

డ్రోన్ కుట్రలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో కుల్గామ్‌లోని ఒక మసీదులో డానిష్-ఉమర్ కలిసినట్లుగా గుర్తించారు. అక్కడ నుంచి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి తన వసతి గృహానికి ఉమర్ తీసుకెళ్లాడు. ఇక్కడే ఉమర్‌ను.. అతని బృందాన్ని డానిష్ ఉగ్రవాదంపై బాగా బ్రెయిన్ వాష్ చేసినట్లుగా తెలుస్తోంది. నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్ (JeM) కోసం ఓవర్-గ్రౌండ్ వర్కర్ (OGW)గా పనిచేయాలని కోరాడు. ఇక ఉమర్‌ను అయితే ఆత్మాహుతి మిషన్ నిర్వహించాలని డానిష్ ప్రేరేపించాడు. అయితే ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నేరం అంటూ ఆ ప్రణాళిక నుంచి ఉమర్ వైదొలిగాడు. దీంతో డ్రోన్ నిర్వహణలో సాంకేతిక నిపుణుడు కాబట్టి ఆ దిశగా ఉమర్‌ను డానిష్ పురికొల్పాడు. జేఎం సహాయంతో ఆర్థిక వనరులు కూడా కూడబెట్టాడు. డిసెంబర్ 6 కోసం ప్రణాళిక రచించుకుంటూ ఉండగా ఇంతలో సన్నిహితుడు డాక్టర్ ముజిమ్ముల్ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో కారులో సరిగ్గా అమర్చలేని ఐఈడీ బాంబ్ ఒక్కసారిగా ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. ఈ కారు బ్లాస్ట్‌తో మొత్తం దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం రచించిన ఉగ్ర కుట్ర బయటపడింది.

నవంబర్ 10న ఢిల్లీ కారు బ్లాస్ట్ వెలుగులోకి రాకపోతే డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా మారణహోమమే జరిగి ఉండేదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. పెద్ద ఎత్తున హమాస్ ఉగ్రవాదుల తరహాలో దేశంలో బాంబ్ దాడులు జరిగేవని అధికారులు పేర్కొన్నారు. పెద్ద వినాశనం తప్పినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

Exit mobile version