Delhi Airport: సాంకేతిక సమస్యతో ఢిల్లీలో వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు ముంబైలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ మేరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వల్ల విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపింది. విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని ప్రయాణికులను అప్రమత్తం చేసింది. మరిన్ని అప్‌డేట్ల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని చెప్పుకొచ్చింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తన ప్రకటనలో ముంబై ఎయిర్ పోర్టు వెల్లడించింది.
Read Also: Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం..
అయితే, ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య వల్లే సుమారు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే తెలియజేసింది. దీన్ని పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు ట్రై చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు టెర్మినల్ లోపల, బోర్డింగ్ గేట్ల దగ్గర భారీగా ప్రయాణికులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. కాగా, ఈ సమస్యకు సైబర్ దాడి ఏమైనా కారణమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూ కారణంగా ముంబైతో పాటు జైపుర్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వారణాసి ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి ఈ ఎయిర్‌పోర్టులకు వచ్చే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
