Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?

Cyclone Arnab

Cyclone Arnab

Cyclone Arnab: అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడింది. తుఫాను తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 150 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. తుఫాను విధ్వంసం వల్ల ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు.

ఇదిలా ఉంటే, తుఫాను సమయంలో ఇంతటి పెను గాలులు ఎలా వీస్తాయి. తుఫాను సముద్రం నుంచి నేలపైకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు వీటి వేగం తగ్గడం లేదనే ప్రశ్నలు సహజం వస్తుంటాయి. అయితే, దీనికి సముద్రంలోని వెచ్చని నీరు, వాయు పీడనంలో తేడాలు, భూమి భ్రమణం వంటివి సహాయపడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తుఫానులో గాలులకు ఇంత శక్తి ఎలా..?

ఉష్ణమండల తుఫానులు సాధారణంగా వెచ్చని సముద్ర జలాలపై ఏర్పడుతాయి. సముద్రంలోని వేడి నీరు దానిపైనున్న గాలిని వేడెక్కిస్తుంది. తేమతో నిండిన ఈ వెచ్చని గాలి పైకి లేవడంతో సముద్ర ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడుతుంది. పైకి వెళ్లిన గాలి స్థానాన్ని భర్తీ చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గాలి వేగంగా ఈ అల్పపీడన కేంద్రం వైపు వెళ్తుంది.

ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే మరింత వెచ్చని, తేమతో కూడిన గాలి తుఫాను వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. గాలిలోని నీటి ఆవిరి చట్టబడి నీటి బిందువులుగా మారినప్పుడు వేడి విడుదల అవుతుంది. ఈ వేడి తుఫానుకు అదనపు శక్తిని ఇస్తుంది. ఇదే సమయంలో భూ భ్రమణ వేగం కారణంగా గాలి దిశ మారుతుంది. దీంతో గాలి ఒక క్రమబద్ధమైన భ్రమణ వ్యవస్థగా ఏర్పడుతుంది.

తుఫాను కేంద్రంలోని వాయు పీడనానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పీడనానికి మధ్య తేడా ఎంత ఎక్కువగా ఉంటే, గాలి వేగం అంత బలంగా ఉండే అవకాశం ఉంది. తీవ్రమైన తుఫానుల్లో అత్యంత బలమైన గాలులకు ఇదే ప్రధాన కారణం.

గంటకు 150 కి.మీ వేగంతో గాలులు..

అర్నబ్ తుఫాను తీరం దాటే సమయంలో ఏపీ, యానాం తీర ప్రాంతాల్లో అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల మధ్య ఉండగా, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగానికి చేరింది. ఈ రెండు వేగాల మధ్య తేడా ఉంది. నిర్దిష్ట వ్యవధిలో స్థిరంగా కొనసాగిని వేగాన్ని ‘సస్టెయిన్డ్ విండ్ స్పీడ్’ అని, తక్కువ వ్యవధిలో అకస్మాత్తుగా బలంగా వీచిన గాలిని ‘గస్ట్‌లు’’ అంటారు. ఈ గాలులు కొద్దిసేపే కొనసాగినప్పటికీ చాలా విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా చెట్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలుతాయి.

తీరం దాటిన తర్వాత క్రమంగా తగ్గనున్న ప్రభావం..

అర్నబ్ తుఫాను బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పలు గంటల పాటు కొనసాగింది. ఏపీలో నరసాపురం వద్ద తీరాన్ని దాటింది. భారత వాతావరణ శాఖ(IMD) దీనిని ‘అత్యంత తీవ్ర తుఫాను’ స్థాయి నుంచి ‘తీవ్ర తుఫాను’ స్థాయికి తగ్గించింది.

తుఫాను భూభాగం పైకి వచ్చిన తర్వాత వాటికి శక్తిని అందించే వెచ్చని సముద్ర నీరు దూరం అవుతుంది. భూమిపై ఏర్పడే ఘర్షణ కూడా తుఫాను గాలుల వేగాన్ని, దాని భ్రమణాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా తుఫాను బలహీనపడుతుంది. తుఫాను భూమికిపైకి చేరినప్పటికీ వెంటనే గాలుల వేగం తగ్గదు. క్రమంగా భూమిపై ముందుకు కదులుతున్నా కొద్ది తుఫాను బలం క్రమంగా క్షీణించి, నెమ్మదిగా గాలుల వేగం కూడా తగ్గుతుంది.