Chain Snatch: తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలో గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఢిల్లీలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అత్యధిక భద్రత ఉండే, విదేశీ రాయబారులు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Read Also: Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కాపై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
ఢిల్లీ చాణక్యపురిలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో తన తోటి ఎంపీ, డీఎంకే సభ్యురాలు రాజతిలో కలిసి వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. స్కూటర్‌పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసు లాక్కెళ్లినట్లు అందులో పేర్కొన్నారు. ‘‘ సార్, దొంగ తన వ్యతిరేక దిశలో నెమ్మదిగా వస్తున్నందున, చైన్ స్నాచర్ అయి ఉంటాడని అనుమానించలేదు. అతను నా మెడ నుంచి గొలుసు లాగడంతో నా మెడకు గాయమైంది. సహాయం కోసం అభ్యర్థించాము’’ అని సుధా పేర్కొన్నారు.
ఇంతటి హై సెక్యూరిటీలో జోన్‌లో ఒక పార్లమెంట్ సభ్యురాలిపై దాడి జరగడం దిగ్భ్రాంతికరంగా ఉందని అన్నారు. ‘‘నా మెడకు గాయమైంది, 4 సవర్ల కంటే ఎక్కువగా ఉన్న నా బంగారు గొలుసు పోగొట్టుకున్నాను. ఈ దాడితో నేను చాలా బాధపడ్డాను’’ అని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. నేరస్తుడిని పట్టుకునేలా అధికారులను ఆదేశించాలని ఆమె అమిత్ షాని కోరారు.
