CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?

  • CNGలో CBG మిశ్రమానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం..?
  • 2026-27లో CNGలో 3% CBG కలపాలని లక్ష్యం..
  • 2028-29 నాటికి CBG మిశ్రమం 5%కి చేరాలని టార్గెట్..
  • గోబర్ధన్ పథకానికి కేంద్రం ₹23,731 కోట్లు కేటాయించింది.
Cng

Cng

CNG Biogas Blending: దేశంలో CNG వాహనాలకు సంబంధించి కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ (CNG)లో కంప్రెస్డ్ బయోగ్యాస్‌ (CBG)ను కలిపే విధానాన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (BPCL) తన అధికారిక వీడియోలో వివరించింది. దీంతో CNGలో బయోగ్యాస్ మిశ్రమం కలపడంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెట్రోల్ లో 20 శాతం ఇథనాలు కలుపుతున్నారు. ఈ E20 పెట్రోల్‌పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.

కంప్రెస్డ్ బయోగ్యాస్‌ (CBG) అంటే ఏమిటి..?

కంప్రెస్డ్ బయోగ్యాస్‌ (CBG) సాధారణంగా భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ కాదు.ఇది జంతువుల పేడ, ఆహార వ్యర్థాలు, పంట అవశేషాల వంటి సేంద్రియ పదార్థాలు కుళ్లిపోతున్నప్పుడు తయారయ్యే గ్యాస్. దీనిని శుద్ధి చేసి CBGగా మారుస్తారు.

రూ. 23,731 కోట్ల గోబర్ధన్ పథకం..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్(గోబర్ధన్ )(GOBARdhan)కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కింద CBG ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 23,731 కోట్ల కేటాయించారు. ఈ స్కీమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమై 2036 వరకు కొనసాగుతుంది. దశల వారిగా బయోగ్యాస్‌ను CNGలో కలుపనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కలయిక లక్ష్యం 3 శాతంగా ఉంది. దీని తర్వాత, 2027-28 ఆర్థిక సంవత్సరంలో బయో-CNG వాటాను 4 శాతానికి పెంచుతారు. ఈ వాటా 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 5 శాతానికి చేరుకుంటుంది, అంటే ప్రతి సంవత్సరం సుమారుగా 1 శాతం పెరుగుదల ఉంటుంది.

CBG, CNG మైలేజీని తగ్గిస్తుందా?

BPCL వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది యూజర్లు ఈ గ్యాస్ మిశ్రమంపై ప్రశ్నలు లేవనెత్తారు. E20 పెట్రోల్ లాగానే, CBG వాడకం కూడా వాహన మైలేజీని తగ్గించవచ్చని కొందరు భావిస్తున్నారు. నిజానికి CBG, CNG రెండింటిలోనూ ప్రధానంగా మీథేన్ వాయువు ఉంటుంది. ఇండియన్ ఆయిల్ నివేదిక ప్రకారం, CBG యొక్క కెలోరిఫిక్ విలువ CNG (సుమారుగా 52,000 kJ/kg)కి సమానంగా ఉంటుంది. అందువల్ల, దీనిని వాహన ఇంధనంగా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ రెండింటిని కలిపినా పెద్ద తేడా ఏం ఉండదు. వాహనాల మైలేజ్‌లో మార్పు రాదు.