తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మెట్రోలో సందడి చేశారు. మెట్రోలో ప్రయాణించి హల్‌చల్ చేశారు. చెన్నై మెట్రో సేవల పనితీరును పరిశీలించేందుకు బుధవారం మెట్రో రైలులో ప్రయాణించిన విజయ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మెట్రో స్టేషన్ కారిడార్లు, మెట్ల మార్గాల్లో అభిమానులు బారులు తీరడంతో సాధారణ తనిఖీ కార్యక్రమం కాస్త ఫ్యాన్ మీట్‌ను తలపించింది.
బుధవారం మధ్యాహ్నం విజయ్ ఒమందూరార్ మెట్రో స్టేషన్ నుంచి నందనం మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ పర్యటనలో మెట్రో అధికారులు ఆయన వెంట ఉన్నారు. అయితే ప్రత్యేక సౌకర్యాలు ఉపయోగించకుండా విజయ్ సాధారణ ప్రయాణికుడిలాగే టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి స్వయంగా టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది, ఇతర అధికారులతో కలిసి స్టేషన్‌లోని కారిడార్ల గుండా మెట్రో ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నారు.
విజయ్ వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అభిమానులు స్టేషన్ కారిడార్లలో భారీగా గుమిగూడారు. భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్ల వెనుక నిలబడి చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల ఉత్సాహానికి విజయ్ కూడా స్పందించారు. చేతిని పైకెత్తి వారికి అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు.
ఆ తర్వాత ఆటోమేటిక్ టికెట్ గేట్ దగ్గరకు చేరుకున్న విజయ్.. తన టోకెన్‌ను స్కాన్ చేసి సాధారణ ప్రయాణికుడిలాగే గేట్ దాటి మెట్రో రైలులోకి వెళ్లారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులతో ఆయన ఆత్మీయంగా మాట్లాడారు. ఓ మహిళా ప్రయాణికురాలు విజయ్‌ను చూసి స్వల్పంగా నమస్కరించగా.. ఆయన చిరునవ్వుతో ఆమె చేతులను పట్టుకుని పలకరించారు. కొద్దిసేపు ఆమెతో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారిని కూడా విజయ్ పలకరించారు. కిటికీ పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికుల బృందంతో కొద్దిసేపు మాట్లాడారు. విజయ్‌తో మాట్లాడే అవకాశం రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేశారు. మెట్రో రైలు బయట కూడా అభిమానుల సందడి కొనసాగింది. స్టేషన్ మెట్ల మార్గాలు, పైభాగంలోని వీక్షణ ప్రాంతాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. విజయ్‌ను ఒక్కసారి చూసేందుకు పోటీపడుతూ నినాదాలు చేశారు. పలువురు మొబైల్ ఫోన్లను పైకెత్తి ఆయన వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు.
మెట్రో ప్రయాణం అనంతరం విజయ్ మెట్రో కంట్రోల్ రూమ్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్లపై మెట్రో రైళ్ల కదలికలు, నెట్‌వర్క్ మ్యాప్‌లు, వివిధ స్టేషన్ల నుంచి వచ్చే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. మెట్రో సేవల నిర్వహణ, నియంత్రణ వ్యవస్థపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. చెన్నై మెట్రో సేవలను పరిశీలించేందుకు వచ్చిన విజయ్.. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి సాధారణ ప్రయాణికుడిలా రైలులో ప్రయాణించడం అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులతో మెట్రో స్టేషన్‌లో సందడి నెలకొంది.
Chief Minister Joseph Vijay Arrived Nandhanam Metro Station pic.twitter.com/1ZmQRAqGIp
— Vignesh Theni (@Vignesh_twitz) July 29, 2026
Chief Minister Joseph Vijay interacted with passengers while travelling on the metro train pic.twitter.com/4z3xFporPZ
— Vignesh Theni (@Vignesh_twitz) July 29, 2026
Chief Minister Joseph Vijay on the Way escalator at the metro railway station. pic.twitter.com/8wurEYoFxz
— Vignesh Theni (@Vignesh_twitz) July 29, 2026

