Site icon NTV Telugu

సీఎంకు షాక్‌.. స్వతంత్ర్య అభ్యర్థిగా బ‌రిలోకి సీఎం‌ సోదరుడు..!

ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. యూపీలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే స్థానంలో ఒకే పార్టీ నుంచి ఓ మంత్రి, ఆమె భ‌ర్త పోటీ ప‌డుతుండ‌గా.. గోవాలో ఓ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం.. త‌న కోడ‌లిపై బ‌రిలో ఉండ‌లేక పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఐదు రాష్ట్రాల్లో ఇక ఎన్నో చిత్రాలు జ‌రుగుతున్నాయి.. తాజాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ నామినేష‌న్ వేశారు.. కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు టికెట్ నిరాకరించడంతో.. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌.. బస్సీ పఠానా అసెంబ్లీ స్థానానికి ఈ రోజు నామినేష‌న్ వేయ‌డం చ‌ర్చ‌గా మారింది.

Read Also: ఏపీ కోవిడ్ అప్‌డేట్‌.. త‌గ్గిన టెస్ట్‌లు, కేసులు..

వ‌చ్చే నెల‌లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. రెండు వారాల క్రిత‌మే అభ్యర్థుల తొలి జాబితాను విడుద‌ల చేసింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, త‌మ‌కు సీటు వ‌స్తుంద‌ని భావించిన కొంద‌రి నేత‌లు ఈ జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.. ముఖ్యంగా మాన్సా, మోగా, మలౌట్, బస్సి పఠానా అసెంబ్లీ నియోజవర్గాల నుంచి టిక్కెట్లు ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది.. దీంతో, కొంద‌రు తిరుగుబాట జెండా ఎగుర‌వేస్తున్నారు.. అందులో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ కూడా ఉండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.. ఖరార్ సివిల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వ‌హించిన మనోహర్ సింగ్.. త‌న ఉద్యోగాన్ని వ‌దులుకొని మ‌రీ రాజ‌కీయాల్లో అడుగుపెట్టాడు.. బస్సీ పఠానా నియోజకవర్గం టెక్కెట్ ఆశించిన ఆయ‌న‌కు నిరాశే ఎదురైంది.. దీంతో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితూ నామినేష‌న్ వేశారు.. మ‌రోవైపు, సోదరుణ్ని బుజ్జగించి పోటీ నుంచి త‌ప్పించేలా చేయ‌డంలో సీఎం చన్నీ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి.. క‌నీసం సొంత సోద‌రుడిని కూడా ఒప్పించ‌లేక‌పోయారు? అ‌నే విమ‌ర్శ‌లు కూడా సీఎంపై వ‌స్తున్నాయి.. మ‌రి ఎన్నిక‌ల వ‌ర‌కు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Exit mobile version