CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!

  • CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతున్న CJP
  • ‘‘3 నెలలు జైల్లో పెట్టినా నిరసన కొనసాగుతుంది’’ అన్న అభిజీత్ దీప్కే
  • అక్టోబర్ 2న ముంబైలో ‘జైల్ భరో ఆందోళన్’కు పిలుపు
  • శివాజీ పార్క్ నిరసనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరణ
Cjp (1)

Cjp (1)

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబైలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 02న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ నిరసనకు పిలపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ సీజేపీ అక్కడే నిరసన నిర్వహించడానికి, ‘‘జైల్ భరో ఆందోళన్’’ కార్యక్రమం నిర్వహించడానికే ముందుకు వెళ్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు అనుమతి నిరాకరించినా తాము వెనక్కి తగ్గబోమని, ముంబై పోలీసులు ఢిల్లీ పోలీసులు కాదని, ముంబై పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు.

నిరసనకారులకు మూడు రోజుల పాటు బెయిల్ దొరకదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తమను జైలులో ఉంచాలనుకున్నా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని , మూడు రోజులు కాదు, మూడు నెలలైనా నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్‌ చేశారు. తన పదవికి రాజీనామా చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరకుపోతే అక్టోబర్ నెలఖారు నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో పారదర్శకత, పౌర సమాజ భాగస్వామ్యం ఉండాలని, అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపేసి, 2025 ఓటర్ జాబితానే ఉంచాలని డిమాండ్ చేశారు. దానిలో ఎలాంటి మార్పులు చేయొద్దని అన్నారు.