Airport Security: దేశంలోని విమానాశ్రయాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో ఆయుధాలు అవసరం లేని కొన్ని సాధారణ భద్రతా విధులను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) జారీ చేసిన సవరించిన విమానాశ్రయ భద్రతా మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు అమలులోకి రావచ్చని తెలుస్తోంది.
అయితే, కీలక భద్రతా విధుల్లో మాత్రం సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉంటారు. ఆయుధాలతో కూడిన రక్షణ, విమానాశ్రయ పరిసర ప్రాంతాల భద్రత, మొబైల్ పెట్రోలింగ్, నిఘా, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు, క్విక్ రెస్సాన్స్ టీమ్ నిర్వహణ వంటి విధుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉంటారు.
సవరించిన గైడ్‌లైన్స్ ప్రకారం.. ఎయిర్‌పోర్టుల్లో ఆయుధాలు అవసరం లేని కొన్ని సాధారణ భద్రతా విధులను ప్రైవేట్ సెక్యూరిటీకి అప్పగించనున్నారు. ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా దశల వారీగా అమలు చేసే అవకాశం ఉంది. అయితే, ఏయే విధులను వీరికి అప్పగిస్తారు, ఎంత మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గిస్తారు? అనే దానిపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం దేశంలో 119 విమానాశ్రయాల్లో 74 చోట్ల సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తోంది. మిగిలిన 45 ఎయిర్‌పోర్టుల్లో రాష్ట్ర సిబ్బంది భద్రతా బాధ్యతలు చేపడుతోంది.
1999 హైజాక్ తర్వాత సీఐఎస్ఎఫ్కు బాధ్యతలు..
1999లో కాఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, లాహోర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కాందహార్‌కు తరలించారు. ఆ సమయంలో ప్రయాణికుల భద్రత కోసం ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్‌ను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు ముందు విమానాశ్రయాల భద్రత బాధ్యత రాష్ట్ర పోలీస్ సిబ్బంది పర్యవేక్షించేది. హైజాక్ ఘటన తర్వాత ఈ బాధ్యతల్ని కేంద్రం సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించింది. సీఐఎస్ఎఫ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. పారిశ్రామిక సంస్థలు, మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాల భద్రతను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.

