NTV Telugu Site icon

Andaman and Nicobar: ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సామూహిక అత్యాచారం.. చీఫ్ సెక్రటరీపై మహిళ ఆరోపణలు

Andaman And Nicobar

Andaman And Nicobar

Chief Secretary physical assault on woman In Andaman and Nicobar: అండమాన్-నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీతో పాటు మరో అధికారి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు 21 ఏళ్ల మహిళ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరైన్, లేబర్ కమిషనర్ ఆర్ఎల్ రిషిలు తనపై రెండు సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ నెల ప్రారంభంలో కేసు నమోదు చేశారు. నరైన్, మార్చి 2021లో అండమాన్ – నికోబార్ ద్వీపం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

సౌత్ అండమాన్ లోని అబెర్డీన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న నరైన్ పై తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీనియర్ పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 21న సదురు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఏప్రిల్, మేలో రెండుసార్లు ఇద్దరు అధికారులు లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. సాక్ష్యాల కోసం అప్పటి ప్రధాన కార్యదర్శి నివాసంలోని సీసీటీవీ పుటేజీని భద్రపరచాలని కోరింది.

Read Also: KA Paul : నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు.. జరగనివ్వను..

సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మహిళ వాంగ్మూలాన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నమోదు చేశారు. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు ఓ హోటల్ యజమాని ద్వారా రిషితో పరిచయం ఏర్పడిందని.. రిషినే నరైన్ నివాసానికి తీసుకెళ్లాడని మహిళ పేర్కొంది. నరైన్ నివాసంలో మద్యం అందించారని..దాన్ని తిరస్కరించానని మహిళ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు తనను దారుణంగా లైంగికంగా వేధించారని.. రెండు వారాల తర్వాత మళ్లీ చీఫ్ సెక్రటరీ తన నివాసానికి పిలిపించి మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని సదరు మహిళ ఆరోపిస్తోంది.