Site icon NTV Telugu

Hotels Add Gas Charge to Bills: హోటల్స్‌ కొత్త బాదుడు.. గ్యాస్‌ ఛార్జీ వసూలు

Hotels Add Gas Charge To Bi

Hotels Add Gas Charge To Bi

Hotels Add Gas Charge to Bills: ఏది కొనుగోలు చేసినా చివరికి భారం పడేది వినియోగదారుడిపైనా.. ఉత్పత్తిదారుడికి కొన్ని సార్లు.. లాభాలు.. కొన్నిసార్లు నష్టాలు ఉండవచ్చు.. కానీ, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధం కారణంగా.. క్రూడాయిల్‌ ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావం పడింది.. దీంతో, పెట్రో, గ్యాస్‌ కు కొరత ఏర్పడుతుంది.. అయితే, ముఖ్యంగా భారత్‌లో కమర్షియల్‌ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది.. వంట గ్యాస్‌ పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. హోటళ్లకు మాత్రం సరఫరా తగ్గించింది.. ఇప్పటికే కొన్ని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడిన పరిస్థితి.. అయితే, చెన్నైలో హోటళ్ల కొత్త బాదుడు ప్రారంభమైంది. గ్యాస్ ఛార్జీ పేరుతో కస్టమర్ల వద్ద అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలోని చాలా హోటళ్లు ప్రతి కస్టమర్ బిల్లులో అదనంగా రూ.10ను గ్యాస్ ఛార్జీ పేరుతో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పెరిగిన ఆహార ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి హోటళ్లలో కూడా ఆహార ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఒక దోసకు రూ.60 వరకు, ఒక ఇడ్లీకి రూ50కు పైగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అదనపు వసూళ్లపై వినియోగదారులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. సంబంధిత అధికారుల చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

గ్యాస్ కొరత కారణమా?
హోటల్ యజమానులు మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు. సాధారణంగా లభించాల్సిన సిలిండర్లు ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో రూ.5,000 నుంచి రూ.6,000 వరకు విక్రయమవుతున్నాయని వారు అంటున్నారు. అధిక ధరకు కొనుగోలు చేసిన గ్యాస్ ఖర్చును కస్టమర్ల నుంచే వసూలు చేస్తున్నామని హోటల్ యజమానులు చెబుతున్నప్పటికీ, వినియోగదారులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version