NTV Telugu Site icon

Char Dam Yatra: ఛార్ దామ్ యాత్రలో 91 మంది యాత్రికుల మృతి

Chardam Yatra

Chardam Yatra

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఛార్ దామ్ యాత్రలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. హిందువులు ఎంతో భక్తితో ఛార్ దామ్ యాత్రకు వస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ చార్ ధామ్ పర్యటనలో భాగంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యాత్రకు హిందూ యాత్రికులు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఛార్ దామ్ యాత్రకు వెళ్లాలననుకునే వారు చాలా మందే ఉంటారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మాత్రం ఛార్ దామ్ యాత్రలో చాలా మరణాలు సంభవించాయి. యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి 91 మంది మరణించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది గుండెపోటు, హై అల్టిట్యూడ్ సిక్ నెస్ కారణంగానే మరణించినట్లు ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ శైలజా భట్ శుక్రవారం వెల్లడించారు. ప్రతీకూల వాతావరణం అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం చూపింది. హిమాలయాల్లో చలి ప్రభావం, ఎత్తైన కొండల్ని ఎక్కడం ఆరోగ్యవంతులకే కష్టంగా ఉంటుంది. ఏమాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. చాలా వరకు సంభవించిన మరణాల్లో ఎక్కువ శాతం అనారోగ్యంతో బాధపడేవారే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఛార్ దామ్ ఆరోగ్య సేవలు మునుపటితో పోలిస్తే మరింత బలోపేతం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా 169 మంది వైద్యులను నియమించారు. మే 3న భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి యాత్రకు అనుమతి ఇవ్వడంతో ఛార్ దామ్ యాత్ర మొదలైంది. ఛార్ దామ్ యాత్రను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మే3న ప్రారంభించారు. మే 6న కేదార్ నాథ్ తెరుచుకోగా.. మే 8న బద్రీనాథ్ యాత్ర ప్రారంభం అయింది. మరోవైపు అనారోగ్యంగా ఉన్న భక్తులు రావద్దని ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్క్రీనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది.