Pitbull: పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి ప్రమాదకరమైన జాతులను నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. మానవ ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన పిట్ బుల్స్, ఇతర జాతుల అమ్మకం, పెంపకం కోసం ఎలాంటి లైసెన్సులు జారీ చేయకుండా చూసుకోవాలని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
Read Also: Russia: పుతిన్ సంచలన నిర్ణయం.. ఫిన్లాండ్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు..
నిషేధించడానికి సిఫార్సు చేయబడిన కుక్క జాతుల్లో పిట్ పిట్ బుల్ టెర్రియర్లు, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలెరియో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోయర్‌బోయెల్, కంగల్, వివిధ షెపర్డ్ డాగ్‌లు, టోర్న్‌జాక్, బాండోగ్, సర్ప్లానినాక్, జపనీస్ తోసా, అకిటా, మాస్టిఫ్స్, రోట్‌వీలర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, ఓల్ఫ్ డాగ్స్, కానారియో, అక్బాష్, మాస్కో గార్డ్‌డాగ్ ఉన్నాయి.
చట్టవిరుద్ధమైన ఫైటింగ్‌తో పాటు కొన్ని డాగ్ బ్రీడ్స్ కారణంగా తరుచూ దాడులు చేస్తున్న లేదా ప్రాణాలు తీస్తున్న కుక్కల నుంచి ప్రజల ప్రాణాలు రక్షించాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) నుంచి విజ్ఞప్తులు చేసిన కొన్ని రోజుల తర్వాత కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. దేశంలో పలు చోట్ల పిట్ బుల్ వంటి ప్రమాదకరమైన డాగ్స్ వల్ల ప్రజలు గాయాల పాలవుతున్నారు. కొన్నిసార్లు దాడులు చేసి ప్రజల మరణానికి కారణమయ్యాయి. ఇటీవల ఢిల్లీలో పిట్ బుల్ దాడి వల్ల పసిబిడ్డ 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. పొరుగువారిపై దాడి చేసేలా పిట్ బుల్‌ని దాని యజమాని రెచ్చగొట్టడం వల్ల ఘజియాబాద్‌లో 10 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.