Al Falah University: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న 32 కార్లతో భారీ దాడులు చేయాలని ఉగ్ర డాక్టర్లు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు, ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న హర్యానా ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు పడింది. ఈ యూనివర్సిటీ నిధులపై దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. ఈ యూనివర్సిటీ నుంచే ఢిల్లీ పేలుళ్లకు కుట్ర పన్నారనే ఆరోపణ ఉంది.
Read Also: Delhi Car Blast: 32 కార్లతో “బాబ్రీ మసీదు” కూల్చివేతకు ప్రతీకార కుట్ర..
కేంద్రం ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆర్థిక కార్యకలాపాలను, ఖాతాలను ఆడిట్ చేయాలని ఆదేశించింది. ఇదే కాకుండా దాని ఆర్థిక వ్యవహరాలపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కూడా పరిశీలించాలని కోరింది. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ ఉగ్రదాడిపై విచారణ చేస్తోంది. ఈ ఉగ్రదాడికి కుట్ర చేసి అమలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు డాక్టర్లుతో ఈ యూనివర్సిటీకి సంబంధం ఉంది. దీంతో ఈ వర్సిటీపై ఏజెన్సీలు దృష్టిసారించాయి.
70 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న అల్ ఫలా అనేది ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి 27 కి.మీ దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ. సోమవారం ఐ20 కారులో పేలుడు పదార్థాలను పేల్చి ఆత్మాహుతికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ ఈ యూనివర్సిటీ డాక్టర్. డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లు కూడా ఈ వర్సిటీలోనే పనిచేశారు. ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ముజమ్మిల్ షకీల్ గదిలో నేరారోపణ సామాగ్రిని కనుగొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, కోడెడ్ మెసేజ్‌లు కలిగిన ఇద్దరు డాక్టర్ల డైరీలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా తమ ఉగ్ర ప్రణాళికల్ని చర్చించడానికి డాక్టర్ ముజమ్మిల్ గదిలో రహస్యంగా సమావేశమయ్యే వారని తేలింది. బాంబు తయారీలో ఉపయోగించేందుకు వర్సిటీ ప్రయోగశాల నుంచి కొన్ని రసాయనాలను అక్రమంగా రవాణా చేశారు.
