NTV Telugu Site icon

Hit And Run: కేంద్రం కీలక నిర్ణయం.. పరిహారం భారీగా పెంపు..

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది… హిట్ అండ్ రన్ మరణాల పరిహారాన్ని కేంద్రం రూ.25,000 నుంచి రూ.2 లక్షలకు పెంచింది.. దేశంలో ఇప్పటి వరకు హిట్ అండ్ రన్ కేసుల పరిహారం రూ.25,000గా ఉండగా… ఇకపై ఈ కేసుల పరిహారం రూ.2 లక్షలకు కేంద్రం సవరించింది… ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం హిట్ అండ్ రన్ బాధితుల బంధువులకు ఏప్రిల్ 1 నుండి నష్టపరిహారం ఎనిమిది రెట్లు పెంచింది.. అంటే.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కేసుల్లో మరణించినవారికి రూ.2 లక్షల పరిహారం అందించనుంది. ఇక, హిట్ అండ్ రన్ కేసులో తీవ్ర గాయాలపాలైన వ్యక్తికి ఇచ్చే సొలేటియం ప్రస్తుతం రూ.12,500గా ఉండగా.. దానిని రూ.50,000కి పెంచింది.

Read Also: IND vs SL: రోహిత్‌ శర్మ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే ఒకేఒక్కడు..

ఫిబ్రవరి 25న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ‘హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీమ్ బాధితులకు పరిహారం’, 2022 అని పిలవవచ్చని మరియు ఇది ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది.. కాగా, ఆగస్టు 2, 2021న మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ముసాయిదా పథకం నోటిఫై చేయబడింది. ప్రస్తుతం హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి 1989 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. పాత చట్టంలో నష్టపరిహారం చాలా చాలా తక్కువగా ఉండటంతో కేంద్రం కీలక సవరణలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న వివరాల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,31,714 మంది మృతిచెందారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో మృతులకు, బాధితులకు పరిహారం కోసం ప్రభుత్వం మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ల విషయంలో పరిహారం అందించడానికి మరియు ప్రమాద బాధితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.