కరోనా సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిపోవడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. విమాన సిబ్బంది ఇకపై పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
అయితే విమానాశ్రయాల్లో, విమానాల్లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి అని కేంద్రం తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. విమానాల్లోనూ, ఎయిర్ పోర్టుల్లోనూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మూడు సీట్లను ఎమర్జెన్సీ అవసరాల కోసం ఖాళీగా ఉంచాలన్న నిబంధనను కూడా కేంద్రం విధించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయడంతో ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రారంభించాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇండియా నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మారిషస్, మలేషియా, థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాక్‌తో పాటు 40 దేశాలకు చెందిన 60 విదేశీ విమాన సంస్థలు ఈ ఏడాది వేసవిలో 1783 సర్వీసులను ఇండియా నుంచి నడిపేందుకు అనుమతి పొందాయి.
