Site icon NTV Telugu

కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రూల్స్ స‌వ‌ర‌ణ‌.. నోటిఫికేష‌న్ జారీ

Cable TV

టీవీ ఛానెళ్ల ప్ర‌సారాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే, పౌరుల స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు, 1994 సవరణ‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్రం పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ మేరకు కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రూల్స్‌ను సవరించినట్లు ఆయన ప్రకటించారు. ఈ రూల్స్‌ ఆధారంగానే ప్రొగ్రామ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ కోడ్‌ రూపొందించారు. టెలివిజన్‌ ఛానల్స్‌ వీటిని పాటించాల్సి ఉంటుంది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం, 1995 నిబంధనలకు అనుగుణంగా టెలివిజన్ చానెల్స్ ప్రసారం చేసిన విషయాలకు సంబంధించిన పౌరుల మనోవేదనలను, స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించడానికి చట్టపరమైన యంత్రాంగం ప‌నిచేయ‌నుంది..

కాగా, ప్రస్తుతం నిబంధనల ప్రకారం కార్యక్రమాలు, ప్రకటనల కోడ్‌ల ఉల్లంఘనకు సంబంధించి వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ద్వారా సంస్థాగత విధానం ఉంది.. అలాగే వివిధ ఛాన‌ళ్ల యాజ‌మాన్యాలు.. ఫిర్యాదుల పరిష్కారానికి సొంతంగా అంతర్గత స్వీయ నియంత్రణ విధానాలను కూడా అభివృద్ధి చేసుకున్నాయి. అయిన‌ప్ప‌టికీ, ఫిర్యాదుల పరిష్కార ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి చట్టబద్ధమైన యంత్రాంగాన్ని తేవాల్సిన అవసరం ఉన్న‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించి.. ఈ నిర్ణ‌యానికి వ‌చ్చింది.. అయితే, ఇక నుంచి ఛానల్స్‌ గనుక అలాంటి సంస్థలను ఏర్పాటు చేస్తే.. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండాలి. అంటే ఈ సంస్థలకు చట్టపరమైన గుర్తింపు ఉండాల్సిందే.

Exit mobile version