Site icon NTV Telugu

Ceiling Fan Falls on Woman Judge: కోర్టులో విచారణ సమయంలో మహిళా జడ్జీపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. తీవ్ర గాయాలు..

Court

Court

Ceiling Fan Falls on Woman Judge: ఓ కేసు విచారణ కొనసాగుతోన్న సమయంలో మహిళా న్యాయమూర్తిపై సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడిన ఘటన కలకలం రేపింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా కోర్టులో.. సోమవారం ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టులో విచారణ జరుగుతుండగా, పనిచేస్తున్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడిపడి మహిళా అదనపు సెషన్స్ జడ్జిపై పడింది. ఈ ఘటనతో కోర్టు గదిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. అదే సమయంలో పైకప్పుకు అమర్చిన సీలింగ్ ఫ్యాన్ విరిగి నేరుగా జడ్జి కూర్చున్న కుర్చీపై పడింది. ఈ ప్రమాదంలో మహిళా న్యాయమూర్తి తలకు, భుజానికి గాయాలయ్యాయి.

ఇక, గాయపడిన న్యాయమూర్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కోర్టు ప్రాంగణంలో పనిచేస్తున్న న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్ఎల్ యాదవ్‌ మరియు న్యాయవాది వినోద్‌.. కోర్టు భవనం శిథిలావస్థలో ఉందని ఆరోపించారు. కోర్టు గదులలోని విద్యుత్ అమరికలు, వైరింగ్ చాలా సంవత్సరాల నాటివి. పైకప్పులు కారడం, నిర్మాణం బలహీనపడటం వంటి సమస్యలపై ఇప్పటికే పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని తెలిపారు.

ఈ ఘటన తర్వాత కోర్టు భవనం భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవనాన్ని పూర్తిగా పునర్నిర్మించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు హెచ్చరించారు. అందువల్ల త్వరలోనే కొత్త కోర్టు భవనాన్ని నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న భవనానికి తక్షణమే పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version