Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో ఆప్ సర్కారుకు కొత్త చిక్కు.. బస్సుల కొనుగోళ్లలో గోల్‌మాల్!

Delhi

Delhi

Delhi: ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సర్కారుకు లోఫ్లోర్‌ బస్సుల వ్యవహారం రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్‌ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించారు. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ 1,000 లోఫ్లోర్‌ బస్సులను కొనుగోలు చేయడంపై చీఫ్‌ సెక్రటరీ సురేశ్‌ కుమార్‌ సూచనల మేరకు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించిందని తెలిపాయి. కాగా, ఈ దర్యాప్తు కేవలం రాజకీయ ప్రేరేపితమైనదని ఆప్‌ సర్కారు ఆరోపించింది.

Gyanvapi Mosque Case: వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక నిర్ణయం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్‌ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిన్న ఎక్సైజ్‌ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్‌ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు.

Exit mobile version