NTV Telugu Site icon

Indo-Bangla border: ‘‘మిమ్మల్ని భారత్‌లోకి అనుమతించలేం’’.. బంగ్లాదేశ్ శరణార్థులకు సర్దిచెబుతున్న అధికారి.. వీడియో వైరల్..

Bangladesh Violence

Bangladesh Violence

Indo-Bangla border: షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగింది. ఆ దేశంలోని మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై మతోన్మాదులు దాడులకు తెగబడ్డారు. గ్రామాలు, నగరాలు అనే తేడా లేకుండా హిందువుల ఇళ్లపై దాడి చేశారు. వారి వ్యాపారాలను దోచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో హిందు యువతులను కిడ్నాప్ చేయడంతో పాటు అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో హింస నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బంగ్లాదేశీ శరణార్థులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వేల సంఖ్యలో అక్కడి ప్రజలు ఇండో-బంగ్లా బోర్డర్ వైపు వస్తున్నారు. శరణార్థుల తాకిడి ఎక్కువ ఉంటుందనే కారణంతోనే ఇటీవల కేంద్రం సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

ఇదిలా ఉంటే, తమను ఇండియాలోకి అనుమతించాలని పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ శరణార్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారుల్ని వేడుకుంటున్నారు. అయితే, అధికారులు వారిని ఎందుకు అనుమతించలేరనే విషయాన్ని వివరిస్తున్నారు. తాజాగా ఓ బీఎస్ఎఫ్ అధికారి బంగ్లాదేశ్ శరణార్థులతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంటోంది. అంతటి గంభీర పరిస్థితుల్లో కూడా సదరు అధికారి వారికి నచ్చచెప్పిన వీడియో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్ కూచ్‌బెహార్‌లోని సరిహద్దుల ప్రాంతంలో శరణార్థుల గుంపుతో ఆయన బెంగాలీలో మాట్లాడారు. ‘‘మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాకు తెలుసు. అందుకే మీరు ఇక్కడికి వచ్చారని తెలుసు. అయితే మేం కోరుకున్నా కూడా మిమ్మల్ని లోపలికి రానీవ్వలేం. దీనిపై చర్చ జరగాలి. సమస్యను ఈ పద్ధతిలో పరిష్కరించలేం’’అని ఆయన వారికి నచ్చచెప్పారు.

Read Also: Pawan Kalyan: పవర్ స్టార్ ఫాన్స్ కి పండగే.. రీరిలీజ్ కాబోతున్న పవర్ ప్యాకెడ్ మూవీ

గుంపు నిరసన తెలుపుతున్న సందర్భంలో ‘‘ దయచేసి నా మాట వినండి, అరవడం వల్ల ఏమీ బయటపడదు. మీ సమస్య ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే చర్చ అవసరం. చర్చ జరిగిన తర్వాత, మేము మిమ్మల్ని ఎలా రక్షించగలమో చూస్తాము. నా దేశం తరపున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించబడతాయి. తిరిగి వెళ్లమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, ఒక గంట లేదా రెండు గంటల్లో పరిష్కారం కనుగొనబడదు’’ అని ఆయన అన్నారు.

దీనికి శరణార్ధులు స్పందిస్తూ.. ‘‘వారు మా ఇళ్లను తగులబెడతారు, మేము దౌర్జన్యాలను ఎదుర్కొంటాము’’ అని చెప్పారు. దీనికి బీఎస్ఎఫ్ అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సీనియర్ అధికారులు, మీ భద్రతా సిబ్బంది(బంగ్లాదేశ్) తో మాట్లాడారు. వారు మీ సమస్యల్ని వింటారు. వారు మిమ్మల్ని తిరిగి రావాలని కోరారు’’ అని అన్నారు. ఇంతటి పరిస్థితుల్లో కూడా ఎంతో ప్రశాంతంగా శరణార్థులకు అర్థమయ్యేలా చెప్పిన బీఎస్ఎఫ్ అధికారి వీడియో వైరల్ అయింది. చాలా మంది నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.