NTV Telugu Site icon

India-Canada Row: ‘‘తీవ్రంగా పరిగణించాలి’’.. కెనడాకు వంతపాడిన అమెరికా..

India Canada Roe

India Canada Roe

India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం తారాస్థాయికి చేరింది. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. కెనడాలోని తన ఆరుగురు రాయబారులను వెనక్కి పిలిచింది. ఇదే విధంగా ఇండియాలోని ఆరుగురు కెనడా రాయబారుల్ని శనివారం సాయంత్రంలోగా దేశం వదిలివెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇదిలా ఉంటే, కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలకు అమెరికా వంత పాడుతోంది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా భారత్‌ని కోరింది. మంగళవారం వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూమిల్లర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణల్ని ‘‘తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా స్పష్టం చేసింది.

Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా.. ప్రభుత్వంలో చేరని కాంగ్రెస్..

‘‘కెనడా విషయానికి వస్తే ఆరోపణలు తీవ్రమైనవని మేము స్పష్టం చేశాము. కెనడాకు భారత ప్రభుత్వం సహకరించేలా చూడాలని మేము కోరుతున్నాము.’’ అని మిల్లర్ అన్నారు. నిజ్జర్ కేసులో భారత్ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు పంచుకున్నట్లు కెనడా చేసిన వాదనల్ని భారత్ గట్టిగా తిరస్కరించింది. కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో తన రాజకీయ లబ్ధి కోసమే, సిక్కు ఓట్ల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్ మండిపడింది.

న్యూజిలాండ్ కూడా భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలపై స్పందించింది. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ మాట్లాడుతూ.. కెనడా అధికారులు చేసిన బహిరంగ ఆరోపణలు, రుజువైతే చాలా ఆందోళన కలిగించే విషమయని అన్నారు. అమెరికా తర్వాత భారత్‌పై వ్యాఖ్యానించిన 5-ఐస్ దేశాల్లో న్యూజిలాండ్ రెండోది. ఫైవ్ ఐస్ దేశాల్లో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ఏ ఉన్నాయి.