Site icon NTV Telugu

Building Collapse: కుప్పకూలిన భవనం.. సజీవ సమాధైన కుటుంబం

Amaravati Building Collapse

Amaravati Building Collapse

Building Collapse Kills Five In Amravati City: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం కుప్పకూలి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అమరావతిలోని ప్రభాత్ టాకీస్ ప్రాంతంలో ఈ దుర్ఘటన మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం సంభవించిందని, అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొదటి, రెండవ అంతస్తులను రాజేంద్ర లాడ్జ్‌గా మార్చగా.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదు దుకాణాలు ఉన్నాయి. శిథిలాలను తొలగించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలసులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని మున్సిపాలిటీ ఇదివరకే డిక్లేర్ చేసిందని, 2020లోనే నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొన్ని నెలల క్రితం మొదటి, రెండవ అంతస్తుల్ని ఖాళీ చేయించి, కూల్చేశారన్నారు. కొన్ని భాగాల్ని మాత్రం అలాగే ఉంచేశారన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెండు షాపుల్ని బ్యాగ్ తయారీ దుకాణంగా మార్చారని, భవనం కూలిపోతున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు అక్కడే ఉన్నారని చెప్పారు. ఇతర షాపులు మాత్రం ఖాళీగా ఉన్నాయన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందన్న విషయం తెలిసి కూడా షాపు యజమాని ఐదుగురి వ్యక్తుల్ని పనిలో పెట్టుకున్నాడని.. అతని నిర్లక్ష్యం వల్లే ఆ ఐదుగురు మృతి చెందడంతో ఐసీపీ సెక్షన్ 304ఏ కింద అతనిపై కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇక అమరావతి ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్ శివ ఆడె మాట్లాడుతూ.. “అగ్నిమాపక దళానికి చెందిన 25 మందికి పైగా సిబ్బందితో పాటు కలెక్టర్ కార్యాలయానికి చెందిన విపత్తు బృందం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. భవనం కూలిన వెంటనే స్థానికులు ఒక వ్యక్తితో పాటు మరో మహిళను రక్షించారు. మేము జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి శిథిలాల్ని తొలగించాం. ఐదుగురు వ్యక్తులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. వాళ్లు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు’’ అని చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డివిజనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.

Exit mobile version