NTV Telugu Site icon

Budget 2025: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. ఆధునికీకరణకు పెద్దపీట..

Budget 2025

Budget 2025

Budget 2025: 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 2025-26 బడ్జెట్‌లో ఢిఫెన్స్ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాది రూ. 6.2 లక్షల నుంచి 9.55 శాతం పెరుగుదల. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక సన్నద్ధతను మరింత పెంచే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Read Also: Buggana Rajendranath: అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు.. కూటమి సర్కార్‌పై బుగ్గన విసుర్లు

బడ్జెట్‌లో రూ. 3.11 లక్షల కోట్లను రెవెన్యూ వ్యయంగా కేటాయించారు. ఇది 2024-25లో రూ. 2.83 లక్షల కోట్లుగా ఉంది. సాధారణ సాయుధ దళాల రోజూ వారీ నిర్వహణను ఇది కవర్ చేస్తుంది. ఇందులో జీతాలు, పరికరాల నిర్వహణ, మందుగుండు సామాగ్రి, ఇతర వినియోగ వస్తువులతో పాటు సైన్యాన్ని ఎప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంచేందుకు, భద్రతా ముప్పుని ఎదుర్కునే సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

ఆధునికీకరణకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. మూలధన వ్యయాన్ని రూ. 1.8 లక్షల కోట్లుగా నిర్ణయించారు. గతేడాది ఇది రూ. 1.72 లక్షల కోట్లుగా ఉంది. సాయుధ దళాల ఆధునికీకరణ, అధునాతన వ్యవస్థలు, పరికరాలు, ఆయుధాల సేకరణకు ఇది చాలా కీలకం మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించడం ఆత్మనిర్భర భారత్‌కి చాలా కీలకం. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను నిర్మించడాన్ని కేంద్రం ప్రోత్సహించింది. యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, డ్రోన్లు, సాయుధ దళాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది. రక్షణ పెన్షన్లకు పెద్ద మొత్తంలో సహకారం పెరిగింది. పదవీ విరమణ చేసిన రక్షణ సిబ్బంది, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు రూ. 1.6 లక్షల కోట్లను కేటాయించారు. పెన్షన్ నిధులు పెరగడం వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది.