BSP: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ని ప్రకటించారు. ఆదివారం లక్నోలో జరిగిన సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర ప్రాంతాల్లో పార్టీకి వారసుడిగా ఆకాష్ ఆనంద్‌ని ప్రకటించగా.. ఈ రెండు రాష్ట్రాల్లో బాధ్యతలను మాయావతి పర్యవేక్షించనున్నట్లు సమచారం.
ఆకాష్ ఆనంద్ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. గతేడాది పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆకాష్ ఆనంద్ మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు. 31 ఏళ్ల ఆనంద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2022లో అల్వార్‌లో 13 కిలోమీటర్ల “స్వాభిమాన్ సంకల్ప్ యాత్ర”లో పాల్గొన్నారు. అప్పటి నుంచే అతని పేరు రాజకీయాల్లో వినిపించడం ప్రారంభమైంది. 2018లో రాజస్థాన్‌లో బీఎస్పీ ఆరు సీట్లు సాధించిన బీఎస్పీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కనిపించారు. 2016లో బీఎస్పీలో చేరిన ఆనంద్ 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో తన పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరిగా ఉన్నారు. 2024 ఎన్నికలకు 5 నెలల ముందు బీఎస్పీ తన కొత్త చీఫ్‌గా అతని పేరు ప్రకటించింది.
యూపీ మాజీ సీఎంగా పనిచేసిన మాయావతి, ప్రస్తుతం రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటున్నారు.గతంలో చూపిన విధంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావం చూపించలేకపోతున్నారు. ఆ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) పోషిస్తోంది.