NTV Telugu Site icon

B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కాదు!. బ్రాహ్మణులు, షెడ్యూల్డ్‌ కులాలట

Himachalpradesh

Himachalpradesh

B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ అని మాత్రమే మనకు తెలుసు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బీజేపీ వేరే అర్థం చెబుతోంది. బీఎస్సీ అంటే బ్రాహ్మణులు, షెడ్యూల్డ్‌ కులాలంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త ఫార్ములాతోనే గెలవాలనుకుంటోంది. ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ నాయకత్వంలో హిమాచల్‌ప్రదేశ్‌లో కమలనాథులు వరుసగా రెండోసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆ రాష్ట్రానికి చెందినవారే. కాబట్టి పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌పుత్‌లు 30 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానం షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీల)దే. ఎస్సీలు 25 శాతం, బ్రహ్మణులు 19 శాతం, ఓబీసీలు 14 శాతం ఉన్నారు. మొత్తం 68 సీట్లు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ముందుగా రాజ్‌పుత్‌లను ప్రసన్నం చేసుకోవాలి. జనరల్‌ సీట్లు 48 ఉండగా అందులో 33 కన్నా ఎక్కువ సీట్లలోనే రాజ్‌పుత్‌ల ఆధిపత్యం నెలకొంది.

ఒక వైపు సీఎం జైరామ్‌ ఠాకూర్‌, మరో వైపు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తమ కులం ఓట్లు బీజేపీకే పడేలా కృషి చేస్తున్నారు. రాజ్‌పుత్‌లతోపాటు బ్రాహ్మణులను, షెడ్యూల్డ్‌ కులాల వారిని సైతం ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బీఎస్సీ ఫ్యాక్టర్‌ను మాత్రమే పూర్తిగా నమ్ముకోకుండా హతీ వర్గాన్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే హతీ కమ్యూనిటీకి గిరిజన హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం జైరామ్‌ ఠాకూర్‌ ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని కలిశారు.

షెడ్యూల్డ్‌ కులాలతోపాటు ఇతర కులాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని బీజేపీ సర్కారు వివక్షకు తావు లేకుండా ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని, తద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులను గెలుచుకున్నామని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఉనికిలోనే లేదని, జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కోసం పోరాడుతోందని చెప్పారు.