Site icon NTV Telugu

UP: నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా.. తొలి రాత్రి నవ వధువు హల్‌చల్.. ఆలస్యంగా వెలుగులోకి..!

Upwomen

Upwomen

హనీమూన్ మర్డర్‌ కేసులో సోనమ్ రఘువంశీ ఉదంతం ఇంకా మరిచిపోక ముందే మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తొలి రాత్రి శోభనం గదిలో నవ వధువు కత్తి పట్టుకుని చంపేస్తానంటూ భర్తను తీవ్రంగా బెదిరించింది. తాకితే 35 ముక్కలు చేస్తానని.. ఈ శరీరం అమన్‌కు అంకితం చేశానని బెదిరించింది. దీంతో 3 రాత్రులు కొత్త పెళ్లికొడుకుకి కాళరాత్రి అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Beautician Anusha: కుటుంబ కలహలు.. మనస్తాపంతో ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య.!

ప్రయాగ్‌రాజ్‌లోని ఏడీఏ కాలనీకి చెందిన 26 ఏళ్ల కెప్టెన్ నిషాద్‌కు.. కరాచన దీహా గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ్ నిషాద్ కుమార్తె సితారతో ఏప్రిల్ 29న వివాహం జరిగింది. ఏప్రిల్ 30న సితార అత్తమామల ఇంటికి వచ్చింది. ఇక మే 2న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బంధువులు, అతిథులతో అంతా సందడిగా ఉంది. కానీ గదిలో మాత్రం సితార కత్తి పట్టుకుని నిషాద్‌ను తీవ్రంగా బెదిరించింది. తాకితే 35 ముక్కలు చేస్తానని.. ఈ దేహం అమన్‌కు అంకితం చేశానని.. తల్లిదండ్రుల పోరు భరించలేక పెళ్లి చేసుకున్నట్లు తెగేసి చెప్పింది. ఇలా మూడు రాత్రులు భయం.. భయంతో నిషాద్ గడిపాడు. ఇక సితార ఒక మూలన కూర్చుని తలపై ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని ఉండేది. నిషాద్ మరో ప్రక్కన కూర్చుని అర్ధరాత్రి నిద్రపోయేవాడు. ఇలా ఎంత కాలం ఉండాలంటూ మొత్తానికి నిషాద్.. తన తల్లితో చెప్పుకుని వాపోయాడు. ఆ విధంగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!

తాను గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె నిశ్శబ్దంగా కూర్చుని ఉండేదని.. పూర్తిగా ముసుగు వేసుకుని పదునైన కత్తి పట్టుకుని కూర్చుని ఉండేదని నిషాద్ చెప్పాడు. ఆమె నిర్మొహమాటంగా తనకు ప్రియుడు అమన్ ఉన్నాడని.. అతడితోనే సుఖం పంచుకోవాలని అనుకుంటున్నాని చెప్పిందన్నాడు. తాకే ప్రయత్నం చేస్తే మాత్రం 35 ముక్కలు చేస్తానని బెదిరించిందని వాపోయాడు. ఏమీ చేయలేక సోఫాలో కూర్చుని ఉండేవాడినని.. ఆమె నిద్ర పోయాక.. తాను నిద్రపోయేవాడినని బాధ వెళ్లబుచ్చాడు. అలా మూడు రాత్రులు గడిచాయని తెలిపాడు. ఇలాంటి వార్తలు పేపర్లో చదివేవాడినని.. తనకు అలా జరిగితే మరొక శీర్షిక అయ్యేవాడినని వాపోయాడు. మే 3న బాధ భరించలేక తన తల్లితో పంచుకున్నట్లు చెప్పాడు. అమన్‌ దగ్గరకు పంపాలని.. అతనితోనే జీవిస్తానని సితార బహిరంగంగా తెగేసి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి భరించలేకే ఇదంతా చేసినట్లు ఆమె ఒప్పుకుంది. అయితే బాధిత కుటుంబం సితార కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయగా.. భర్తతోనే కాపురం చెయ్యాలని నచ్చజెప్పి సితార తండ్రి వెళ్లిపోయాడు.

ఇదిలా ఉంటే మే 30న గోడ దూకి సితార పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ప్రధాన గేటు తాళం వేసి ఉండడంతో సాధ్యం కాలేదు. అర్ధరాత్రి ఆమె కుంటుతూ తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తానికి అమన్‌తో సితార పారిపోయింది. ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆమె కోసం గాలిస్తున్నారు. తీసుకొచ్చాక.. సితారను నిషాద్ దగ్గరకు పంపుతారా? లేదంటే ప్రియుడు అమన్ దగ్గరకు పంపుతారా? అనేది తేలాల్సి ఉంది. ఇక ఆమెతో కాపురం చేయడం కష్టమని.. ఎన్ని రాత్రులు భయంతో బ్రతకాలని నిషాద్ అంటున్నాడు. ఇక అమన్.. సితారకు దగ్గర బంధువు కావడం విశేషం. సితార తండ్రికి అమన్ స్వయానా మేనల్లుడు అవుతాడు. ఈ కథ ఎలా ముగుస్తుందో చూడాలి. కాకపోతే రాజా రఘువంశీలా నిషాద్ బలికాకుండా బ్రతికిపోయాడు.

 

Exit mobile version