BRICS: బ్రిక్స్ సమావేశాలకు న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. రష్యా, చైనా దేశాలతో సహా పలు దేశాలకు చెందిన అధినేతలు, దౌత్య బృందాలు వస్తుండటంతో ఢిల్లీలో సెక్యూరిటీ అలర్ట్ అయింది. విదేశీ అతిథులు, వీవీఐపీల రాకపోకల నేపథ్యంలో ఢిల్లీలో అనేక అంచెల భద్రతా వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలు, విమాన నిరోధక తుపాకులు, స్నైపర్లు, బాంబ్ డిఫ్యూజ్ టీమ్‌లు, ప్రత్యేక కమాండోలను రంగంలోకి దించారు. న్యూఢిల్లీ డీసీసీ సచిన్ శర్మ ప్రకారం.. బ్రిక్ సదస్సు భద్రత కోసం 25000 మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. ఇందులో 1000 మందికి పైగా ఢిల్లీ పోలీస్ SWAT కమాండోలు, 100 మందికి పైగా NSG కమాండోలు కూడా భద్రతా విధుల్లో ఉంటారు. ఐబీ, ఎస్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి.
భారత మండపం వల్ల హై సెక్యూరిటీ..
బ్రిక్స్ ప్రధాన కార్యక్రమం జరిగే భారత మండపం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అతిథులు బస చేసే హోటళ్లు, కార్యక్రమ వేదిక, ఎయిర్ పోర్టు నుంచి అతిథుల రాకపోకల మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌లో తనిఖీలు, ఐడీ చెకింగ్, సీసీటీవీ నిఘా, ఇతర సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వైద్య, అంబులెన్స్, ఫైర్, క్విక్ రెస్పాన్స్ టీంలు సిద్ధంగా ఉంచారు.
డ్రోన్లపై నిషేధం..
భద్రతా కారణాల వల్ల నిర్దేశిత ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ఎగిరే వస్తువులపై నిషేధం విధించారు. అనుమానాస్పద వైమానిక కార్యకలాపాలను గుర్తించేందుకు యాంటీ-డ్రోన్ వ్యవస్థల్ని యాక్టివేట్ చేశారు. భవనాలపై స్నైపర్లు, సాయుధ కమాండోలను మోహరించనున్నారు. విమాన నిరోధక తుపాకులను సైతం భద్రతా ఏర్పాట్లలో సిద్ధం చేశారు.
35 రహదారుల్లో ట్రాఫిక్ ఎఫెక్ట్..
వీవీఐపీ కాన్వాయ్ రాకకపోకల్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని 35కు పైగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ప్రభావితం కాబోతోంది. అవసరమైన సమయంలో మాత్రమే ఈ మార్గాల్లో ట్రాఫిక్ నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడం చేయనున్నారు.. సర్దార్ పటేల్ మార్గ్, మదర్ థెరిసా క్రెసెంట్, తీన్ మూర్తి మార్గ్, అక్బర్ రోడ్, తేజ్ జనవరి మార్గ్, మధుర రోడ్, జనపథ్, అశోక రోడ్, బరాఖంబా రోడ్, లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. పటేల్ చౌక్, ఆర్ఎంఎల్ హాస్పిటల్ రౌండ్అబౌట్, ధౌలా కువాన్, మోతీ బాగ్ ఫ్లైఓవర్, నీలా గుంబద్, ఒబెరాయ్ ఫ్లైఓవర్, మండి హౌస్ తదితర ప్రాంతాలను ప్రధాన డైవర్షన్ పాయింట్లుగా గుర్తించారు.
జీపీఎస్, సీసీటీవీతో రియల్‌టైమ్ మానిటరింగ్..
వీవీఐపీ కాన్వాయ్‌లలోని వాహనాల కదలికల్ని ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా పర్యవేక్షించనున్నారు. సీసీటీవీ కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ రూం, రియల్ టైమ్ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించేలా ఏర్పాట్లు చేశారు.

