Prajwal Revanna: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ సంచలనంగా మారింది. పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ పరిణామం తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీ వెళ్లాడు. ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై వారి ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ ఉదంతంపై ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు మహిళ కిడ్నాప్ కేసులో నిన్న హెచ్‌డీ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే డిప్లామాట్ పాస్‌పోర్టుపై ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లాడు. ఇతడిని రప్పించేందుకు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా ‘బ్లూ కార్నర్ నోటీస్’ జారీ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అన్నారు. అతను ఎక్కడ ఉన్నాడో సిట్ కనుక్కుంటుందని, ఆ తర్వాత అతను ఇక్కడికి తీసుకురాబడుతారని చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు.
Read Also: Harish Rao: గ్యారంటీలపై రాహుల్‌తో రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పించారు
బ్లూ కార్నర్ నోటీసులు అంటే ఏమిటి..?
బ్లూ-కార్నర్ నోటీసు అనేది వాంటెడ్ వ్యక్తులు లేదా నేరస్థుల గురించి సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడానికి ఉపయోగించే హెచ్చరిక. ఈ వ్యవస్థ ద్వారా దేశాల మధ్య నేరస్థుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఇంటర్‌పోల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, బ్లూ కార్నర్ నోటీసులు క్రిమినల్ విచారణలో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాయి. ఒక వ్యక్తి యొక్క నేర చరిత్ర వివరాలు పొందడంతో పాటు తప్పిపోయిన వ్యక్తిని గుర్తించడానికి ఈ నోటీసులు ఉపయోగపడుతాయి.
సీబీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ వంటి వివిధ రకాల నోటీసులు ఉంటాయి. ఇందులో రెడ్ కార్నర్ నోటీసులు నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరుతాయి. నేరారోపణ దాఖలు చేయడానికి ముందు లేదా తర్వాత బ్లూ కార్నర్ నోటీసులు వస్తాయి. ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉండటంతో ఆయనను రప్పించే పనిలో అధికారులు ఉన్నారు.