దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఫ్రెస్టేజీగా తీసుకుంది. అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఉచిత పథకాలతో ఓటర్ల ముందుకు వచ్చింది. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పాత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. ‘విక్షిత్ ఢిల్లీ’ కోసం రోడ్‌మ్యాప్ అని పేర్కొన్నారు. ఢిల్లీని అవినీతి రహితంగా మార్చడమే బీజేపీ లక్ష్యమని నడ్డా తెలిపారు. సంకల్ప్ పాత్ర ఢిల్లీ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇవే!
1. మహిళా సమ్మాన్ నిధి పేరుతో ప్రతి నెల మహిళలకు రూ. 2,500 సాయం
2. పేద మహిళలకు రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్
3. హోలీ, దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్
4. మహిళలకు 6 పౌష్టికాహార కిట్లు, గర్భిణులకు రూ.21 వేలు సాయం
5. వృద్ధాప్య పెన్షన్ పెంపు
‘‘2014లో 500 వాగ్దానాలు ఇస్తే 499 అమలు చేశాం. 2019లో 235 హామీలు ఇస్తే 225 అమలు చేశాం. మిగిలినవి కూడా పూర్తి చేస్తాం.’’ అని నడ్డా తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆప్ అవినీతి నుంచి విముక్తి కలిగిస్తామన్నారు. మహిళలే తమకు ప్రధాన ప్రాధాన్యత అన్నారు.