BJP MP: బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి. మధ్యప్రదేశ్‌లోని బర్వానీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యువ సనాతనీలు త్వరగా వివాహం చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి’’ అని పిలుపునిచ్చారు. మారుతున్న జనాభా పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువకులు శారీరకంగా బలంగా ఉండాలని, సమాజాన్ని బలోపేతం చేయడానికి జిమ్‌లు, సంప్రదాయ అఖాడాలను ప్రోత్సహించాలని సూచించారు.
స్వాతంత్య్రం తర్వాత జనాభా పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, 1947 నుంచి 1967 మధ్య పరిస్థితులు వేరుగా ఉండేవని, దీని తర్వాత ఒక వర్గం జనాభా గ్రాఫ్ పెరగగా, మరో వర్గం జనాభా తగ్గిందని అన్నారు. గతంలో 20, 21 ఏళ్లలో యువకులు వివాహం చేసుకునే వారని, నలుగురి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారని చెప్పారు. ప్రస్తుతం యువత 30-37 ఏళ్ల మధ్య పెళ్లిళ్లు చేసుకుని, ఒకే సంతానానికి పరిమితమవుతున్నారని అన్నారు. అందుకే సనాతనీల జననాల రేటు 1.9గా ఉందని, యువత పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలని అన్నారు.
భక్తితో పాటు యువత శారీరకంగా బలంగా ఉండాలని పటేల్ సూచించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, ఆడంబర ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీజే, డ్రగ్స్, డౌరీపై యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

