Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..

Bisleri Water

Bisleri Water

Bisleri Water: బయటకు వెళ్లినప్పుడు వాటర్‌ బాటిల్‌ తీసుకోవాలంటే.. అది బిస్లరీయేనా? అడిగి మరీ తీసుకుంటారు..? అది లేకపోతే తప్ప మరో వాటర్‌ బాటిల్‌ వైపు మొగ్గు చూపరు.. ఇప్పుడు అదే సురక్షితం కాదని తెలిస్తే బిత్తర పోవాల్సిందే మరి.. ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్‌ను పరీక్షించగా ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో ఆ శాంపిల్‌ను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ‘అసురక్షితమైనది’గా FSSAI ప్రకటించింది. ఈ వ్యవహారంలో కంపెనీపై ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి ఇచ్చింది.

వాటర్ శాంపిల్‌లో ఏమి గుర్తించారు?
FSSAI తెలిపిన వివరాల ప్రకారం.. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రాంగణం నుంచి సాధారణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్‌ను అధికారులు సేకరించారు. ఈ శాంపిల్‌లో బ్రోమేట్ పరిమితికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. దీంతో ఆ శాంపిల్‌ను సురక్షితం కాదని ప్రకటించారు. కంపెనీ అప్పీల్ చేసుకోవడంతో శాంపిల్‌ను రిఫరల్ ఫుడ్ లేబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) గుర్తించినట్లు FSSAI వెల్లడించింది. ఈ ఫలితాల ఆధారంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి, బిస్లరీపై చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చింది.

మినరల్ వాటర్‌పై కాదు.. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పైనే చర్యలు
ఈ వ్యవహారంలో FSSAI మరో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. బిస్లరీకి చెందిన అన్ని రకాల నీటి ఉత్పత్తులపై ఈ చర్యలు తీసుకోలేదని తెలిపింది. పరీక్షించిన శాంపిల్ సాధారణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించినదని, మినరల్ వాటర్‌గా బ్రాండింగ్ చేసిన ఉత్పత్తికి సంబంధించినది కాదని వెల్లడించింది. కాబట్టి ఈ చర్యలను బిస్లరీ మినరల్ వాటర్ ఉత్పత్తులన్నింటికీ వర్తింపజేయకూడదని స్పష్టం చేసింది.

బిస్లరీ కంపెనీ వివరణ ఇదీ..
ఈ వ్యవహారంపై బిస్లరీ సంస్థ కూడా స్పందించింది. వినియోగదారులకు అందించే తాగునీటి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపింది. ఈ సమస్యను సరైన నియంత్రణ ప్రక్రియల ద్వారా పరిష్కరించేందుకు FSSAIతో సహకరిస్తామని కంపెనీ వెల్లడించింది.

మరికొన్ని కంపెనీలపైనా FSSAI చర్యలు
బిస్లరీతో పాటు మరికొన్ని సంస్థలపైనా FSSAI కఠిన చర్యలు తీసుకుంది. వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మీమాంస ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. అలాగే నిబంధనలను పాటించని ఉర్మి లైఫ్‌సైన్సెస్ LLP, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఆశా కన్ఫెక్షనరీకి చెందిన ప్రీ-ప్యాక్డ్ చాక్లెట్ ఫిల్డ్ కుకీస్ పరీక్షల్లో అసురక్షితంగా తేలడంతో వాటిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అయితే, 2026లో ఆహార పరిశ్రమ సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలపై FSSAI తన పర్యవేక్షణను, తనిఖీలను మరింత పెంచింది. ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారీ సంస్థలపైనా నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరిస్తోంది. వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకుంటోంది.