NTV Telugu Site icon

Bird Flu: జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. 4000 కోళ్లను చంపనున్న ప్రభుత్వం

Bird Flu

Bird Flu

Bird Flu Outbreak In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. బొకారో జిల్లాలో ప్రభుత్వం నడిపే ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. వ్యాధి ప్రభావిత ప్రాంతంలోని 4000 కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ ప్రారంభం అయింది. హెచ్5ఎన్1, ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ రకం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ‘కడక్ నాథ్’ కొళ్లలో గుర్తించారు. దీనివల్ల జిల్లాలోని లోహాంచల్ లోని కోళ్ల ఫారమ్ లో 800 కోళ్లు చనిపోయాయి. మరో 103 కోళ్లను అధికారులు చంపేశారు.

Read Also: Father Apologizes: నవీన్‌ కుటుంబానికి హరిహర కృష్ణ తండ్రి క్షమాపణలు..

వ్యాధి ప్రభావిత ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ పరిధిలోని “కోళ్లు మరియు బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. ఆదివారం కూడా కోళ్లను చంపనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న పొలంలో పక్షులు చనిపోవడంతో నమూనాలను భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కు పరీక్షల నిమిత్తం పంపగా ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే పొలానికి 1 కి.మీ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్‌గా ప్రకటించగా, 10 కి.మీ పరిధిలోని ప్రాంతాలను నిఘా జోన్‌గా ప్రకటించింది. జిల్లాలో చికెన్‌, బాతుల విక్రయాలపై నిషేధం విధించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రం అప్రమత్తంగా ఉందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ(హెల్త్) అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో నిఘా పర్యవేక్షణకు, పెద్ద కోళ్ల ఫారాల వద్ద నమూనాలను సేకరించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రభావిత ప్రాంతంలోని ప్రజల నమూనాలను కూడా సేకరిస్తున్నారు. ఒక వేళ ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తీసుకురావాలని సూచిస్తున్నారు. సదర్ ఆస్పత్రిలో బర్డ్ ఫ్లూ కోసం ప్రత్యేకవార్డును ఏర్పాటు చేశారు.