Site icon NTV Telugu

Custodial torture : కస్టడీలో వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పు..! ముగ్గురు పోలీసులపై చర్యలు..

Custodial Torture

Custodial Torture

Custodial torture : పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం సృష్టించింది.. బీహార్ రాష్ట్రంలో పోలీసుల దారుణ ప్రవర్తన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లాలో దొంగతనం ఒప్పుకోలని ఒక ఆభరణాల దుకాణ కార్మికుడిని పోలీస్ కస్టడీలో తీవ్రంగా హింసించిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. డిసెంబర్ నెలలో సమస్తిపూర్‌లోని ఒక ఆభరణాల దుకాణం నుంచి 60 గ్రాముల బంగారం దొంగతనం జరిగిన కేసులో ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తితో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, అతడిని నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారు.

Read Also: Chiranjeevi: పొట్ట కోటి కోసం పొట్ట మాడ్చుకున్నా

బాధితుడి ఆరోపణల ప్రకారం, కస్టడీలో ఉన్న సమయంలో పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టి, ఒప్పుకోలని బలవంతం చేశారు. అంతేకాదు, అతని ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి కాల్చేస్తామని బెదిరించినట్లు కూడా తెలిపాడు. ఈ హింస కారణంగా అతని ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల కస్టడీ అనంతరం జనవరి 5న అతడిని బాండ్‌పై విడుదల చేశారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత అతని పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, దొంగతనం జరిగిన దుకాణ యజమాని కూడా ఆ వ్యక్తిని మరియు ఇతర ఉద్యోగులను కొట్టి, పోలీసులకు అప్పగించే ముందు వారిని బిల్డింగ్‌ పై నుంచి తోసేస్తానని బెదిరించినట్లు బాధితుడు వెల్లడించాడు.

బాధితుడి తల్లి మాట్లాడుతూ.. ఈ కేసులో తమపై కుట్ర పన్నారని ఆరోపించారు. తమ కుమారుడితో పాటు తనను, భర్తను కూడా మూడు రోజుల పాటు తాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. కుటుంబ సభ్యులను విడుదల చేయడానికి పోలీసులు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో సమస్తిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ అరవింద్ ప్రతాప్ సింగ్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో తాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శంకర్ శరణ్ దాస్‌తో పాటు రాజ్‌వంశ్ కుమార్, రాహుల్ కుమార్ అనే ఇద్దరు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, పోలీస్ కస్టడీలో మానవ హక్కుల ఉల్లంఘనలపై మరోసారి చర్చ మొదలైంది.

Exit mobile version