10 Reasons For NDA Grand Victory in Bihar: ఎంతో ఉత్కంఠగా సాగిన హైవోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్డీయే కూటమి మరోసారి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్ ఓటర్లు నితీశ్ కుమార్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఓవైపు వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్.. ఇంకోవైపు కుల రాజకీయాలు.. వీటన్నిటి నడుమ సాగిన పోరులో.. చివరకు ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఇంతకీ బీజేపీ, నితీశ్ జోడీని బీహార్ ప్రజలు మళ్లీ ఎందుకు గెలిపించారు? ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందనుకున్న సందర్భంలో కూడా ఎన్డీయే కూటమికి ఈ విజయం ఎలా సాధ్యమైంది. ?
ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో… ఏ పార్టీ ఏ కూటమితో జతకడుతుందో బీహార్ లో ఊహించడం కష్టం. మిగతా రాష్ట్రాల సంగతేమో గానీ.. బీహార్ రాజకీయాలు చాలా టిపికల్ గా ఉంటాయ్. చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేస్తాయి. అందుకే అన్ని పార్టీలు ఏ ఒక్క అంశాన్ని వదలిపెట్టకుండా ఎన్నికల బరిలోకి దిగుతాయి. ఈ విషయంలో ఎన్డీయే కూటమికి ఫుల్ మార్కులు వేయాల్సిందే. రాజకీయంగా ఎదురుగాలులు తప్పవన్న విశ్లేషకుల అంచనాలను కూడా ఎన్డీయే పటాపంచలు చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ, జేడీయూ కూటిమికి కలిసి వచ్చిన 10 అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఆ కులాలన్నీ NDA వైపే:
అభివృద్ధికి కులముంటుందా..? మిగతా రాష్ట్రాల్లో ఏమోగానీ బీహార్ లో మాత్రం అన్నింటికీ కులముంటుంది. వికాస్.. అంటే డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే… వికాస్ కులమేంటని అక్కడి ఓటర్లు ప్రశ్నిస్తారట. బీహార్ రాజకీయాల్లో కులం అంతగా పాతుకుపోయి ఉంటుంది. బీహార్ అంటేనే కులాలు.. కట్టుబాట్లు.. ఇలాంటి రాష్ట్రంలో కులాల వారీగా గంపగుత్తగా ఓట్లను కైవసం చేసుకోవడంలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. OBC, EBC, SC వర్గాలు ఈ ఎన్నికల్లో ఎన్డీయే వైపే నిలిచాయి. వెనుకబడిన కులాలైన ఓబీసీల్లో 63 శాతం మంది ఓటర్లు ఎన్డీయేకు జై కొట్టారు. ఇక అత్యంత వెనుకబడిన వర్గాలుగా చెప్పుకునే ఈబీసీల్లో 58 శాతం, ఎస్సీల్లో 49 శాతం బీజేపీ, నితీశ్ కూటమిని గెలిపించారు. వీళ్లతో పాటు అగ్రకులాల్లో కూడా 65 శాతం మంది వీళ్లకు అండగా నిలిచారు. మహాఘట్ బంధన్ ముస్లిం- యాదవ సామాజిక వర్గాలపై మాత్రమే ఆధారపడితే… ఇతర సామాజిక వర్గాల్లోని మెజార్టీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంది ఎన్డీయే కూటమి. టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా సోషల్ ఇంజినీరింగ్ ను పక్కాగా అమలు చేసింది ఎన్డీయే. ఈ క్యాస్ట్ కాంబినేషన్ స్ట్రాటజీనే ఎన్డీయే విజయానికి ప్రధాన కారణమైంది…
మహిళలే మహరాణులు:
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడానికి కారణం ఎవరో తెలుసా…?… మహిళా ఓటర్లు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టిన బీహార్ మహిళా ఓటర్లు … ఎన్డీయే కూటమికి అధికారాన్ని కట్టపెట్టారు. 2.52 కోట్ల మంది మహిళా ఓటర్లు పోలింగ్ లో పాల్గొంటే వాళ్లలో మెజార్టీ కాషాయ కూటమి వైపే నిలిచారు. మహిళల అభివృద్ధి కోసం, వాళ్ల జీవన విధానంలో మార్పు కోసం.. కొన్ని సంవత్సరాలుగా నితీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా పథకాలు ఈసారి ఎన్నికల్లో ఓట్లగా మారాయి. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.4 కోట్ల సహాయక బృందాల మహిళలకు 10వేల రూపాయల నగదు బదిలీ, ఉచిత సైకిళ్ల పథకం, పంచాయితీలలో 50శాతం రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35శాతం రిజర్వేషన్లు, ఉచిత విద్యుత్, మహిళా సంక్షేమం కోసం 2 లక్షల సాయం వంటివి మహిళల్లో నితీష్ పట్ల విశ్వాసాన్ని పెంచాయి. గత ఎన్నికలతో పోల్చితే మహిళా ఓటర్ల మద్దతు ఎన్డీయేకు భారీగా పెరిగింది. సో… బీహార్ రాజకీయాల్లో నితీశ్ మరోసారి కాలర్ ఎగరేసే పరిస్థితి వచ్చిందంటే …మహిళా ఓటర్లు కింగ్ మేకర్స్ గా మారడమే కారణం.
మోడీ ఫ్యాక్టర్ – డబుల్ ఇంజిన్ సర్కార్:
బీహార్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా ఈసారి బాగా పనిచేసింది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ జరిగిన కొన్ని రోజులకే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. బీహార్ గడ్డపై నుంచే ఉగ్రమూకలకు బలమైన సందేశం పంపించారు. భారతీయుల రక్తం కళ్ల చూసిన వాళ్లను విడిచిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బుద్ధ భూమి బీహార్ నుంచే ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటించారు మోడీ. ఇది ఓటర్లలో పాజిటివ్ సెంటిమెంట్ ను రగిల్చింది. బీజేపీ అంటేనే అభివృద్ధి అనే నినాదాన్ని బీహార్ లో గల్లీగల్లీకి తీసుకెళ్లారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామో చేసి చూపించారు. 1.62 లక్షల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం వివిధ పథకాల కోసం బీహార్ కు కేటాయించింది. గయా, పూర్ణియా, మోతిహారీ వంటి ప్రాంతాల్లో వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీహార్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. విద్య, వైద్యం మెజార్టీ ప్రజలకు చేరువైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ తో పాటు మోడీ గ్యారెంటీ అన్న హామీలు ఎన్డీయేపై ఓట్ల వర్షం కురిపించాయి.
నితీశ్ మార్క్ రాజకీయం:
ఆయన ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో ఊహించలేం. ఉదయం ఓ కూటమితో పాలన సాగించి.. సాయంత్రానికి మరో కూటమితో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పై ఉన్న విమర్శ ఇది. పైగా ఈ మధ్య వయసు కారణంగా ఆయనలో తడబాటు కూడా మొదలైంది. ఇక బీహార్ లో నితీశ్ మార్క్ రాజకీయాలకు తెరపడిందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎంత స్ట్రాంగ్ మెన్ అన్నది ఈ ఫలితాలు చెప్పేశాయి. 20 సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకుండా జాగ్రత్త పడటంలో నితీశ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్డీయేతో ఉండటం ద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో నితీశ్ విజయం సాధించారు. ఆ మేరకు బీహార్ లో అభివృద్ధిని ప్రజలు చూసేలా చేశారు. రోడ్లు, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల మెరుగుదల నితీశ్ కు మళ్లీ పట్టం కట్టేలా చేసింది. నితీశ్ ఏ కూటమితో ఉన్నా.. బీహార్ అభివృద్ధిని పక్కన పెట్టరు అన్నమాట జనాల్లోకి బాగా వెళ్లింది. అందుకే 20 సంవత్సరాల పాలనలో ‘సుషాసన్ బాబూ’ అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. రాజకీయాలు తనకు అనుకూలంగా లేవనుకున్నప్పుడు ఎక్కడ తగ్గాలో కూడా నితీశ్ కు బాగా తెలుసు. ఒకప్పుడు బీజేపీకి కండిషన్స్ పెట్టిన నితీశ్.. ఈసారి చెరి సమానంగా 101 సీట్లలో పోటీ చేశారు. ఆ రకంగా బీహార్ పొలిటికల్ డైనమిక్స్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు…
కూటమి సమన్వయం:
బీహార్‌లో ఏక పార్టీ పాలనకు ఎప్పుడో కాలం చెల్లింది. రాజకీయ చదరంగం మొత్తం కూటముల కేంద్రంగానే సాగుతోంది. బీహార్ లో కొన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం అంటే.. కేవలం రాజకీయంగా సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు. కుల, ప్రాంత, వర్గ సమీకరణాలకు కూటములు ప్రతిబింబాలుగా ఉంటాయి. ఈ విషయంలో ముందునుంచీ ఎంతో స్పష్టత ఉన్న ఎన్టీయే పార్టీలు.. ఎంతో వ్యూహాత్మకంగా సమన్వయం చేసుకున్నాయి. కలిసి పోటీ చేసేటప్పుడు ఎన్నో విబేధాలు ఉంటాయి. కానీ ఎన్డీయే వాటిని ఎక్కడా బయటకు రానివ్వలేదు. NDAను గెలిపించడం కోసం కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, జేడీయూ తమ ఫోకస్ ను రాష్ట్రంలో విభిన్నంగా పెట్టాయి. BJP పట్టణాలు, మధ్యతరగతి, యువ ఓటర్ల మీద దృష్టి పెట్టగా, JDU రూరల్ బీహార్, మహిళా వర్గాలు, కుర్మీ, అహిర్ సమాజాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించాయి. మరోవైపు చిన్న పార్టీలే అయినా ఓటర్లను ప్రభావితం చేసే హిందుస్తాని అవామీ మోర్చా, వికాస్‌శీల్ ఇన్సాన్.. లాంటివి చేజారకుండా చూసుకుంది. మహాఘట్ బంధన్ తో పోల్చితే ఎన్డీయే కూటమిలో ఉన్న ఐక్యత ఆ కూటమికి బాగా కలిసి వచ్చింది…
బలమైన బూత్ మేనేజ్‌మెంట్:
ఎన్నికలలో గెలవడంలో ప్రచారం కంటే ముఖ్యమైనది బూత్ స్థాయిలో సమర్థంగా పనిచేసే వ్యవస్థ. NDA ఈ అంశంలో స్ట్రాంగ్ గ్రౌండ్ నెట్ వర్క్ తో ముందుకెళ్లిందనే చెప్పాలి. ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ క్యాడర్ గ్రామ స్థాయి వరకు గడపగడపకు పని చేశాయి. ప్రతి పోలింగ్ బూత్ కు 12 మందితో బృందాన్ని ఏర్పాటు చేసి ఓటర్లను గుర్తించడం, పోలింగ్ రోజు ఓట్లు వేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేశారు. ఇక జేడీయూ కూడా తమకున్న స్థానిక నెట్ వర్క్ ను బలంగా వాడుకుంది. పంచాయతీ స్థాయి నాయకులు, మహిళా సంఘాలు, యువజన దళాలు తమతమ ప్రాంతాల్లో ఓటర్లను సమన్వయ పరిచి ఎన్డీయేకు ఓటు వేసేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవల్ లో కేడర్.. పై స్థాయిలో నాయకత్వం.. వీటి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా బూత్ మేనేజ్మెంట్ ను సమర్థవంతంగా నిర్వహించింది ఎన్డీయే.
హామీల సునామీ:
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బీహార్ లో సుస్థిర పాలన సాధ్యమని చెప్పిన ఎన్డీయే కూటమి.. ఈ ఎన్నికల్లో బీహారీలపై హామీల సునామీ కురిపించింది. కోటి ఉద్యోగాలు, మెగా స్కిల్ సెంటర్లు, మహిళలకు రెండు లక్షల సాయం, 7 ఎక్స్ ప్రెస్ వేలు, 10 ఎయిర్ పోర్టులతో రాష్ట్రం రూపురేఖలు మార్చేయడం, పీఎం కిసాన్ ద్వారా ఎంఎస్పీ గ్యారెంటీ, 50 లక్షల ఇళ్లు, ఉచిత విద్యుత్… ఇలా ఒక్కటేంటి.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎన్డీయే కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలు కూటమి విజయానికి ప్లస్ పాయింట్స్ గా మారాయి.
Also Read: Nara Lokesh: దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ!
జంగిల్ రాజ్ భయం:
1995 -2005 మధ్య కాలంలో బీహార్ లో అరాచక పాలన రాజ్యమేలింది. లాలూ ప్రసాద్, ఆర్జేడీ పాలనను జంగిల్ రాజ్ గా చెబుతారు. నేరాలు, కిడ్నాప్ లు, అవినీతి ఇవన్నీ బీహార్ ను ఆటవిక రాజ్యంగా మార్చేశాయన్న విమర్శలున్నాయి. మహాఘట్ బంధన్ అధికారంలోకి వస్తే మళ్లీ బీహార్ లో జంగిల్ రాజ్ రావడం ఖాయమని ఎన్డీయే విస్తృతంగా ప్రచారం చేసింది. అభివృద్ధితో కూడిన సుస్థిరమైన పాలన కావాలా.. లేక దమ్మీలు, దోపీడీల రాజ్యం కావాలా అని ఓటర్లను ప్రశ్నించింది. లాలూ, రబ్రీ పాలన మళ్లీ రాకుండా ఉండాలంటే ఎన్డీయేను గెలిపించాలని మోడీ చేసిన ప్రచారం కూడా ఓటర్లను ఆకట్టుకుంది.
కాంగ్రెస్ కూుటమిలో కల్లోలం:
ఎలాగైనా ఎన్డీయేను ఓడించాలని ఒక్క తాటిపైకి వచ్చిన కాంగ్రెస్, ఆర్జేడీ , ఇతర పార్టీలు.. పైకి కనిపించినంత ఐక్యంగా లేవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సీట్ల పంపకాల్లో కూటమి పార్టీల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే.. 12 స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి దిగాయి. కొంతమంది అభ్యర్థులైతే చివరి నిమిషంలో పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. తమ పార్టీని తక్కువ అంచనా వేస్తున్నారంటూ కాంగ్రెస్, ఆర్జేడీపై తీవ్రంగా విరుచుపడ్డ జేఎంఎం పార్టీ.. కూటమి రాజకీయాలు తట్టుకోలేక చివరకు బీహార్ ఎన్నికల బరి నుంచే తప్పుకుంది. మరోవైపు తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఏ స్థాయిలో ప్రచారం నిర్వహించినా… గ్రౌండ్ లెవల్ లో మాత్రం పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపించింది. మహాగట్ బంధన్ లో చోటుచేసుకున్న అంతర్గత సంక్షోభం… పరోక్షంగా ఎన్డీయేకు కలిసివచ్చేలా చేసింది. ఇలాంటి కూటమి అధికారంలోకి వస్తే.. ఒకరి తలలు మరొకరు పట్టుకుంటారంటూ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేశాయి.
కనిపించని పీకే ఫ్యాక్టర్:
ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను వెనుక నుంచి నడిపించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… జన్ సురాజ్ పార్టీ పేరుతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగినా… ఆయన చూపించిన ప్రభావం నామమాత్రమే. ప్రధానమైన రెండు కూటమిలు.. ఎన్డీయే, మహాగట్ బంధన్ ను కాదని.. ప్రశాంత్ కిషోర్ పార్టీని ఓటర్లు ఆదరించే స్థాయికి చేరుకోలేకపోయారు. పార్టీ కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తుందనుకున్న సమయంలో కీలకమైన అభ్యర్థులు సైతం బీజేపీలోకి మారడం, పార్టీ నేతల మధ్య అంతర్గత అసంతృప్తి కారణంగా జన్ సురాజ్ పార్టీ బలహీనంగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ భారీ స్థాయిలో ఓట్లను చీల్చకపోవడం.. ఎన్డీయే కూటమికి కలిసొచ్చింది.
ఈ పది కారణాలే ఎన్డీయే కూటమికి మళ్లీ అధికారాన్ని అందించాయి. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నితీశ్ పాలనపై వ్యతిరేకతను కూడా తగ్గించాయి. అందుకే బీహార్ ఎన్డీయే వశమైంది.
