Bharat Taxi: కేంద్రం ‘‘భారత్ టాక్సీ’’ని ప్రారంభించింది. ఇది ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్‌లను నేరుగా సవాల్ చేయనుంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, జాతీయ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD)లు ఈ సర్వీస్‌ను ప్రారంభించాయి. డ్రైవర్లకు వారి సంపాదనపై పూర్తి హక్కును ఇవ్వడంతో పాటు ప్రయాణికులకు ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు బదులుగా ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
చాలా ఏళ్లుగా ప్రైవేట్ క్యాబ్ సంస్థలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. టాక్సీ సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జీలు పెంచడం, ఏకపక్షంగా రైడ్‌లను రద్దు చేయడంతో పాటు ధరలు ఆకస్మిక పెరుగుదలపై పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పాటు ఈ సంస్థల కింద క్యాబ్‌లు నడుపుతున్న డ్రైవర్లు, తమకు వచ్చే డబ్బులో ఎక్కువ మొత్తం కమిషన్లు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. కంపెనీలు వసూలు చేసే అధిక కమీషన్ రేట్లపై చాలా మంది డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు, తరచుగా వారి ఛార్జీల ఆదాయంలో 25 శాతం వరకు కోల్పోతారు.
Read Also: Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ-2025 బుకింగ్స్ ప్రారంభం, నవంబర్ 4న లాంచింగ్..
కొత్తగా తీసుకువస్తున్న భారత్ టాక్సీ ప్లాట్‌ఫామ్ దీనిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. ప్రైవేట్ అగ్రిగేటర్లలా కాకుండా, భారత్ టాక్సీ డ్రైవర్లు తమ రైడ్ డబ్బుల్లో కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు. నామమాత్రపు రోజూవారీ లేదా నెలవారీ రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల డ్రైవర్లు ఎక్కువగా సంపాదించుకునే వీలు కలుగుతుంది.
భారత్ టాక్సీ పైలట్ దశ నవంబర్ ఢిల్లీలో ప్రారంభం కానుంది. 650 వాహనాలు సేవలు అందించనున్నాయి. ఇది విజయవంతమైతే, పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో డిసెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. తరువాత ఈ సేవలు ముంబై, పూణే, భోపాల్, లక్నో , జైపూర్‌తో సహా 20 నగరాలకు క్రమంగా విస్తరించనున్నారు. మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు ఈ సేవలు విస్తరించాలని భావిస్తున్నారు. 2030 నాటికి, ఈ ప్లాట్‌ఫారమ్ జిల్లా ప్రధాన కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేలా 1 లక్ష మంది డ్రైవర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
