Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్‌కు అవమానం.. ఆప్ ఆగ్రహం

  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్‌కు అవమానం
  • 3 గంటల నిర్బంధం.. రూ.50 వేల జరిమానా
  • కేంద్రంపై ఆప్ ఆగ్రహం
Bhagwant Mann

Bhagwant Mann

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించారని, రాత్రి సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారని.. అలాగే రూ.50 వేల జరిమానా విధించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించింది. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఆయనను విమానాశ్రయంలో సుమారు మూడు గంటల పాటు నిలిపివేశారని ఆప్‌ పంజాబ్ మీడియా ఇన్‌ఛార్జ్ బల్తేజ్ పన్ను తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలతోనే మాన్ పారిస్‌కు వెళ్లారని పన్ను పేర్కొన్నారు. పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఆయనకు రూ.50 వేల జరిమానా విధించారని ఆరోపించారు. అయితే తనిఖీల్లో లగేజీలో ప్రకటించని వస్తువులు ఉన్నందున కస్టమ్స్ అధికారులు జరిమానా విధించినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆహార ఉత్సవంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ముఖ్యమంత్రి పారిస్ వెళ్లారని పన్ను తెలిపారు. మాన్‌కు తగిన ప్రోటోకాల్ కల్పించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినప్పటికీ, పారిస్‌లోని భారత కాన్సుల్ జనరల్ సైతం ఆయనను కలవడానికి రాలేదని ఆరోపించారు. విమానాశ్రయంలో లగేజీ ఇంకా రావాల్సి ఉందని, తనిఖీలు కొనసాగుతున్నాయని చెబుతూ మాన్‌ను వేచి ఉండేలా చేశారని పన్ను పేర్కొన్నారు. మూడు గంటల అనంతరం వెళ్లేందుకు సిద్ధమై వాహనంలో లగేజీని ఉంచుతున్న సమయంలో అధికారులు వచ్చి, పైస్థాయి నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పినట్లు ఆయన ఆరోపించారు. ఆ తర్వాతే రూ.50 వేల జరిమానా విధించారని, ఈ ఘటన వెనుక పైస్థాయి ఆదేశాలు ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమని పన్ను వ్యాఖ్యానించారు. పంజాబీలను అవమానించే అవకాశాన్ని కేంద్రం ఎప్పుడూ వదులుకోవడం లేదని విమర్శించారు. గతంలోనూ మాన్ విదేశీ పర్యటనలకు వెళ్లకుండా కనీసం నాలుగుసార్లు అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్రంపై సౌరభ్ భరద్వాజ్ విమర్శలు

ఈ ఘటనపై ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా స్పందించారు. పంజాబ్ ఉత్పత్తులను పారిస్‌లో పరిచయం చేసేందుకు వెళ్లిన ముఖ్యమంత్రిని కేంద్రం ఇబ్బందులకు గురిచేయడం అహంకారానికి నిదర్శనమని ఎక్స్‌లో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అహంకారానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని, రావణుడి అహంకారానికి కూడా దసరా రోజున ముగింపు పలికారని వ్యాఖ్యానించారు.

మరోవైపు శిరోమణి అకాలీదళ్ ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మజీథియా భిన్నంగా స్పందించారు. భగవంత్ మాన్, ఆయన భార్య గురుప్రీత్ కౌర్ నిబంధనలను ఉల్లంఘించినందువల్లే వారిని నిలిపివేసినట్లు ఆరోపించారు. అనుమతించిన పరిమితికి మించి లగేజీ లేదా నగదు తీసుకెళ్లారనే అనుమానంతో గంటల తరబడి ప్రశ్నించినట్లు సమాచారం ఉందని మజీథియా పేర్కొన్నారు. వాటిపై సరైన వివరణ ఇవ్వలేకపోయారని ఆరోపించారు. చివరకు ముఖ్యమంత్రి హోదాను పరిగణనలోకి తీసుకుని వారిని వెళ్లేందుకు అనుమతించారని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) చెందిన అధికారులతో సహా సిబ్బంది మొత్తం లగేజీని తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.