Site icon NTV Telugu

Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..

Kartik Maharaj

Kartik Maharaj

Kartik Maharaj: 2013లో పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీజేపీకి అనుకూలంగా ఉండే కార్తీక్ మహరాజ్‌పై ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలను అతను ఖండించారు. భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి మహారాజ్, ముర్షిదాబాద్‌లోని ఒక ఆశ్రమంలో ఉన్న ఒక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనను తీసుకెళ్లాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమెకు అదే ఆశ్రయంలో వసతి ఏర్పాటు చేశారు.

అయితే, ఒక రోజు రాత్రి కార్తీక్ మహారాజ్ తన గదిలోకి ప్రవేశించి తనపై బలవంతంగా దాడి చేశాడని మహిళ పేర్కొంది. 2013 జనవరి -జూన్ మధ్య ఆరు నెలల్లో కనీసం 12 సార్లు సన్యాసి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. భయం, నిస్సహాయత కారణంగా ఈ సంఘటన గురించి తాను ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నానని చెప్పింది. పోలీసుల్ని సంప్రదిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..

మహిళ ఆరోపణలతో కార్తీక్ మహారాజ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణల్ని కార్తీక్ మహారాజ్ తిరస్కరించారు. ఈ ఏడాది పద్మశ్రీ అవార్డును అందుకున్న మహారాజ్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. “నేను సన్యాసిని. సన్యాసి జీవితంలో ఇటువంటి అడ్డంకులు అసాధారణం కాదు” అని ఆయన అన్నారు. ఈ విషయంపై తన న్యాయ బృందం కోర్టులో స్పందిస్తుందని మహారాజ్ చెప్పారు.

బీజేపీకి సన్నిహితంగా ఉండే సన్యాసిపై ఈ ఆరోపణలు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కార్తీక్ మహారాజ్ బీజేపీకి సహాయం చేస్తున్నారని, టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఆమె ఆరోపణలపై క్షమాపణలు కోరుతూ ఆయన 2024లో లీగల్ నోటీసులు పంపారు. కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై టీఎంసీ విద్యార్థి నేత అత్యాచారం కేసులు వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత ఈ కార్తీక్ మహారాజ్‌పై ఆరోపణలు వచ్చాయి.

Exit mobile version