NTV Telugu Site icon

Basavalinga Swamy: కర్ణాటకలో మరో మఠాధిపతి సూసైడ్.. ఆ బెదిరింపులే కారణం

Basavalinga Swamy

Basavalinga Swamy

Basavalinga Swamy Commits Suicide By Hanging: కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో బసవ సిద్ధలింగ స్వామి అనే మఠాధిపతి సూసైడ్ ఘటన మరువకముందే.. తాజాగా మరో మఠాధిపతి ఆత్మహత్య చేసుకున్నారు. రామనగర జిల్లా కెంపుపురా గ్రామంలోని శ్రీ కంచుగల్‌ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి.. సోమవారం ఉదయం ఆశ్రమం ఆవరణలో శవమై కనిపించారు. పూజా గదికి ఉన్న కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకొని.. ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయనకు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే అలవాటు ఉంది. కానీ.. సోమవారం మాత్రం ఉదయం 6 గంటలు అవుతున్నా ఆయన కనిపించలేదు. దాంతోపాటు పూజ గది తలుపులు కూడా మూసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా.. ఆయన కిటికీ గ్రిల్‌కి ఉరి వేసుకొని కనిపించారు.

ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు స్వామీజీ మృతదేహాన్ని పరిశీలించగా.. రెండు పేజీల సూసైడ్‌ లెటర్‌ దొరికింది. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తనని ఎవరెవరు బెదిరిస్తున్నారో.. వాళ్ల పేర్లను కూడా ఆ లెఖలో రాసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బ్లాక్‌మెయిల్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తమ ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. మరింత లోతుగా విచారణ చేపట్టారు. కాగా.. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్‌ మఠానికి 1997లో బసవలింగ స్వామి ప్రధాన పీఠాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయనే ఈ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు.